logo

గణపతి వరమందిస్తే.. విజయం సాధించినట్లే

లక్ష్య సిద్ధి కోసం నేతలంతా దేవాలయాలను సందర్శించడం సర్వసాధారణం. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ఈ విశ్వాసం రెట్టింపవుతుంటుంది.

Updated : 17 Apr 2024 06:30 IST

నేతల కోర్కెలు తీర్చే ‘కురుడుమలె’
ఎన్నికలొచ్చాయంటే పోటెత్తే ఆశావహులు

2018 ఎన్నికల సమయంలో దేవాలయానికి వచ్చిన కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌

ఈనాడు, బెంగళూరు: లక్ష్య సిద్ధి కోసం నేతలంతా దేవాలయాలను సందర్శించడం సర్వసాధారణం. ఇక ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులకు ఈ విశ్వాసం రెట్టింపవుతుంటుంది. కనిపించే దేవుళ్లందరికీ ప్రత్యేకంగా పూజలు చేస్తూ లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా రాజకీయ నేతలను విశేషంగా ఆకర్షించే దేవాలయం కర్ణాటకలోని కోలారు జిల్లాలో ఒకటుంది. ఎన్నికలే కాదు.. ఫలితాలొచ్చిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయంలోనూ ఉన్నత పదవుల కోసం ఈ దేవాలయానికి నేతలు బారులు తీరుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఈ దేవాలయాన్ని సందర్శించిన నేతల్లో ఊహించని విధంగా ముఖ్యమంత్రులయ్యారు. అత్యధిక సమయం పాటు ఆ పదవుల్లో కొనసాగారు. ఈ దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించిన పార్టీలు అధికార పగ్గాలు అందుకున్న దాఖలాలుండటంతో విశ్వాసం అంతకంతకూ రెట్టింపవుతోంది. తాజా లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ నేతలు తమ లక్ష్యాలను నెరవేర్చేకునేందుకు ఈ దేవాలయానికి పోటెత్తుతున్నారు. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలో ఉన్న ఆ కురుడుమలె గణపతి దేవాలయం ఎన్నికల హాట్‌స్పాట్‌గా మారటం విశేషం.

నేపథ్యం ఇదీ..

దేవాలయ చారిత్రక కథనాల ప్రకారం కృతయుగంలో త్రిపురాసుర రాక్షస సంహారం కోసం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు 33 కోట్ల మంది దేవతలతో కలిసి గణపతిని సృష్టించారనేది స్థల పురాణం. ఇలా దేవతలంతా ఓ చోట కూటమిలా ఏర్పడి గణపతిని ప్రతిష్ఠించడంతో త్రికూట పర్వతంగా, అనంతరం కూడుమలై (కూటమి ఏర్పాటైన పర్వతం)గా మారి నేడు వాడుక భాషలో కురుడుమలెగా స్థానికులు పిలుస్తుంటారు. అలా కృత యుగంలో ప్రతిష్ఠించిన 14 అడుగులు సాలిగ్రామ గణనాథుడి విగ్రహానికి త్రేతాయుగంలో రావణ సంహారానికి బయలుదేరిన రాముడు, ద్వాపరయుగంలో శమంతకమణిని అపహరించాడన్న అపనింద ఎదుర్కొన్న శ్రీకృష్ణుడు పూజించిన తర్వాతనే విజయం సాధించారని పురాణాల సారాంశం. తొలి మూడు యుగాల వరకు ఆలయ ప్రాంగణం లేని ఈ గణపతికి కలియుగంలో విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు ఆలయాన్ని కట్టించారని ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ప్రతి యుగంలోనూ ప్రజలను ఏలిన నాయకుల కష్టాలు తీర్చిన ఈ గణపతి ఆధునిక యుగంలోని రాజకీయ నాయకుల లక్ష్యాలను తీరుస్తారన్న విశ్వాసం నిండుగా ఉంది. ఆ కారణంగానే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదలు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వరకు ఈ దేవాలయాన్ని సందర్శించి వారి రాజకీయ జీవితాల లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేశారు.

విశ్వాసానికి సాక్ష్యాలివే

  • 1999లో విధానసభ ఎన్నికల సమయంలో అప్పటికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఎస్‌.ఎం.కృష్ణ ఈ దేవాలయం నుంచే ‘పాంచజన్యం’ పేరిట ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 132 స్థానాలతో ఘన విజయం సాధించగా ఎస్‌.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగారు.
  • 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఏపార్టీకీ మెజార్టీ దక్కలేదు. అత్యధిక స్థానాలు గెలుచుకున్న భాజపాకు మెజార్జీ రాకపోవటంతో జనతాదళ్‌ నేతృత్వంలో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ సహకారంతో యునైటెడ్‌ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. ఈ కూటమికి నేతృత్వం వహించిన హెచ్‌డీ దేవేగౌడ ఈ దేవాలయ సందర్శన తర్వాతనే ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ విశ్వాసం కారణంగా దేవేగౌడ కేవలం ఎన్నికల సమయంలోనే కాదు.. కుటుంబ సభ్యులతో కలిసి తరచూ ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.
  • 2018లో కర్ణాటక విధానసభ ఎన్నికల సమయంలో అప్పటికి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ బృందమంతా ఈ దేవాలయం నుంచే ప్రచారాన్ని ప్రారంభించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అత్యధిక స్థానాల్లో విజయం సాధించకపోయినా జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తావనార్హం.
  • 2023 విధానసభ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌ ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135స్థానాల విజయంతో అధికారాన్ని ఏర్పాటు చేసింది.
  • ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్‌గాంధీ.. 2023 ఎన్నికల సందర్భంగా ఈ దేవాలయాన్ని సందర్శించగా మరుసటి నెలలోనే ఆయనపై వేసిన వేటును సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు నేటికీ కాంగ్రెస్‌ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తుంటారు. భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రతి ఎన్నికల సమయంలోనూ, ఆయన కుమారుడు విజయేంద్ర భాజపా అధ్యక్ష పదవిని చేపట్టే ముందు ఈ దేవాలయాన్ని సందర్శించి లక్ష్యాలు నెరవేర్చుకున్నారని రాజకీయ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ప్రముఖ నాయకులతో పాటు అభ్యర్థులు సైతం ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు పోటీ పడుతుండటంతో ఈ దేవాలయ ప్రాశస్త్యం అంతకంతకూ పెరుగుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని