logo

బడుగుల బతుకు ధరాభారం

దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 24 Apr 2024 05:57 IST

 భాజపా పాలన లోపభూయిష్టం
చిత్రదుర్గ సభలో ప్రియాంకగాంధీ

వేదికపై ప్రియాంక గాంధీ, రణదీప్‌సింగ్‌ సుర్జేవాల, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, నేతలు సుధాకర్‌, వీరేంద్ర, సలీం అహ్మద్‌, గోపాలకృష్ణ తదితరులు

చిత్రదుర్గం, న్యూస్‌టుడే : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి  ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం చిత్రదుర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బి.ఎన్‌.చంద్రప్పకు మద్దతుగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. ధరల నియంత్రణలో భాజపా సర్కారు ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. పేదలు, రైతులు, కార్మికుల జీవనం అగమ్యగోచరంగా మారిందన్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందని వాపోయారు. ఉద్యోగ సృష్టి విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చతికిలపడ్డారని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలూ మండుతున్నాయని గుర్తుచేశారు. కన్నడనాట కలసా- బండూరి నాలా సాగునీటి పథకం, రాయచూరులో ఎయిమ్స్‌ శాఖ ఏర్పాటు, చిత్రదుర్గం, దావణగెరె, తుమకూరులో సాగునీటి పథకాలకు కేంద్రం నిధులివ్వడం లేదన్నారు. పన్నుల వాటాలోనూ కోత విధించిందని, కరవు సహాయక నిధులు కరవయ్యాయని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసిందని, ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులను అకారణంగా కారాగారాలకు పంపిందని ధ్వజమెత్తారు. ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో తెల్లధనాన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు నిందించారు. విదేశాల నుంచి నల్ల ధనాన్ని తెప్పిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ది పనులు మందగించాయని, ఎన్నికలప్పుడు మాత్రమే కుల, మత, ధర్మం పేరుతో ప్రజల రెచ్చగొట్టడంలో భాజపా ముందుంటుందని నిందించారు. రైతుల రుణాలను మాఫీ చేసే అంశంపైనా మోదీ సర్కారుకు ఆసక్తి లేదన్నారు. కన్నడనాట ఐదు గ్యారంటీ పథకాలు అద్భుతమని కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, మంత్రి డి.సుధాకర్‌, దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి టి.బి.జయచంద్ర, ఎమ్మెల్యేలు వీరేంద్ర, గోపాలకృష్ణ, విధానపరిషత్‌ సభ్యుడు బి.కె.హరిప్రసాద్‌, నేతలు జయమ్మ, సలీం అహ్మద్‌, హెచ్‌.ఆంజనేయ తదితరులు పాల్గొన్నారు.

చిత్రదుర్గ సభకు విచ్చేసిన జనవాహిని..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని