logo

తల్లీ పిల్లలకు కొవిడ్‌ చికిత్స

మూడోదశ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులనూ వదలడం లేదు. జనవరి మొదటివారం నుంచి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భయాందోళనలో ఉన్నవారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య

Updated : 25 Jan 2022 05:18 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

కొవిడ్‌ వార్డులో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు

మూడోదశ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, శిశువులనూ వదలడం లేదు. జనవరి మొదటివారం నుంచి బాధితుల సంఖ్య పెరుగుతోంది. భయాందోళనలో ఉన్నవారిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం అక్కున చేర్చుకొని మెరుగైన వైద్యసేవలందిస్తోంది. ఇప్పటికే సాధారణ ప్రసవాల ప్రక్రియలో మంచి ప్రతిభను కనబరుస్తున్న ఎంసీహెచ్‌లో ప్రసూతి, పిల్లల వైద్య నిపుణులు పాజిటివ్‌ గర్భిణులకు కాన్పులు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.
13 మందికి కాన్పులు
ఎంసీహెచ్‌లో గత 22 రోజుల్లో 13 మంది గర్భిణులు పాజిటివ్‌తో బిడ్డలకు జన్మనిచ్చారు. ఆస్పత్రి వైద్య బృందాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పులు చేశారు. ప్రసవానంతరం ప్రత్యేక వార్డులో ఉంచి ఇన్‌పేషంట్‌ సేవలందిస్తున్నారు. ఇక్కడ పుట్టిన పిల్లల్లో ఒక్కరికి కూడా పాజిటివ్‌ లేదని వైద్యాధికారులు చెప్పారు. తల్లులకు లక్షణాలు ఉండటంతో వారం శిశువులను దూరంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతర ఆస్పత్రుల్లో జన్మించి కరోనాతో వచ్చిన ఆరుగురు చిన్నారులు ఇక్కడ చికిత్స పొందారు. ప్రస్తుతం సత్తుపల్లి, ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి పాజిటివ్‌తో ఇద్దరు నవజాత శిశువులు రాగా  ప్రత్యేక విభాగంలో వారికి వైద్యం చేస్తున్నారు.
43 మంది గర్భిణులకు పాజిటివ్‌
కరోనా సోకిన తల్లీ పిల్లల కోసం ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. సాధారణ ఆస్పత్రి, ఎంసీహెచ్‌లో మొత్తం 80 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఓపీ విభాగానికి వస్తున్న గర్భిణుల్లో పలువురు పాజిటివ్‌గా తేలుతున్నారు. బాధితుల్లో వైరస్‌ తీవ్రతను గుర్తించి ఇన్‌పేషంట్‌గా చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్‌ ఉందని తేలిన వారికి ఔషధ కిట్లు ఇస్తూ ఇంటి వద్ద ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఏడాదిలో మొత్తం 43 మంది గర్భిణులు పాజిటివ్‌గా తేలారు.
ధైర్యంగా వైద్యసేవలు పొందవచ్చు
- బి.వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు
జిల్లా ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో వచ్చిన గర్భిణులు, బాలింతలు, పిల్లలకు చికిత్సలు అందిస్తున్నాం. కాన్పులు కూడా చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాం. తప్పనిసరైతేనే హైదరాబాద్‌, వరంగల్‌కు రిఫర్‌ చేస్తాం. ఇప్పటివరకు ఆ అవసరం రాలేదు. బాధితులు ధైర్యంగా చికిత్స పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని