logo

అమాత్యా.. ఆస్పత్రులకు చికిత్స చేయరూ!

పేదోడి వైద్యానికి భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్ని ఇంకా కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం గాడిన    పడినప్పటికీ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం ఇంకా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది.

Updated : 28 Jan 2022 06:02 IST

సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వేధిస్తున్న సమస్యలు

ఈటీవీ, ఖమ్మం: పేదోడి వైద్యానికి భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వ ఆస్పత్రుల్ని ఇంకా కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం గాడిన పడినప్పటికీ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం ఇంకా ప్రజలకు అందని ద్రాక్షగానే మిగులుతోంది. జిల్లా ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి లేకుండా.. ప్రైవేటు వైద్యం అవసరం లేకుండా చిన్నపాటి రోగాలు, వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు.. చాలా చోట్ల అలంకార ప్రాయంగానే మిగిలిపోతున్నాయి. కొన్నిచోట్ల మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తుంటే.. మరికొన్ని చోట్ల రూ.లక్షలు ధారపోసి కొనుగోలు చేసిన వైద్య పరికరాలు నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. ఇంకా చాలా ఆరోగ్య కేంద్రాలను మౌలిక సదుపాయాల కొరత వెంటాడుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రులు.. చాలావరకు సాయంత్రానికే మూతబడుతున్నాయి. ప్రసవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ఎక్కడా ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు చాలా వరకు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. వీటిని పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కొంతవరకైనా మెరుగైన వైద్య సేవలు అందుతాయి.


ధిర సీహెచ్‌సీ సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతోంది. భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడిపోతుంది. ఆపరేషన్‌ థియేటర్‌ దాదాపు రెండేళ్ల క్రితం పెచ్చులూడి కూలిపోయింది. విలువైన యంత్రాలు మరమ్మతులకు గురై మూలన పడ్డాయి. 24 గంటలు సేవలందించాల్సిన ఈ ఆస్పత్రి మధ్యాహ్నానికే మూతబడుతుంది. వైద్యులు అంతా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తుండటంతో ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు అందని ద్రాక్షగానే ఉంటున్నాయి.


నేలకొండపల్లిలోని 30 పడకల ఆస్పత్రి ఇది. భవనం శిథిలావస్థలో ఉంది. ఆపరేషన్‌ థియేటర్‌ నిరుపయోగంగా ఉంది. రేడియాలజీ విభాగం పనిచేయడం లేదు. ఒక్కరే వైద్యులు ఉండటం వల్ల సరైన సేవలు అందడం లేదు. సాధారణ ప్రసవాలు మాత్రమే చేస్తున్నారు. శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ఖమ్మం పంపుతున్నారు. ఆస్పత్రిలో మొత్తం 25 మంది వైద్య సిబ్బందికి కేవలం ఆరుగురే ఉన్నారు. స్టాఫ్‌ నర్సులు ఏడుగురుకి నలుగురే ఉన్నారు.


తెలంగాణ-ఏపీ సరిహద్దు ప్రాంతంగా ఉన్న సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో 50 పడకలున్నాయి. రోజుకు ఓపీ సుమారు 400 వరకు ఉంటుంది. ఆ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులో లేవు. మొత్తం 22 మంది వైద్యులకు తొమ్మిది మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఆర్థోపెడిక్‌, స్కానింగ్‌ సేవలు అందుబాటులో లేవు. ఎక్స్‌ రే డిజిటల్‌ సేవలు లేవు. పిల్లల వైద్యులు అందుబటులో లేరు. అత్యవసర వైద్యం అందించే పరిస్థితి లేదు. ప్రధానమైన అన్ని రక్తపరీక్షలు చేసే సౌకర్యం లేదు.


జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు ఇలా..
ప్రాథమిక  26
సామాజిక 6
పట్టణ 4


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని