logo

ఆదుకునేందుకు వెళ్తూ.. అనంత లోకాలకు

 బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని భార్యతో కలిసి వెళ్తున్న ఆ ఉద్యోగి గమ్యస్థానం చేరకుండానే అనంత లోకాలకు చేరారు. ఖమ్మం మిషన్‌ భగీరథ ఇంట్రా విభాగం డివిజన్‌ కార్యాలయంలో సహాయ టెక్నికల్‌ అధికారిగా

Published : 23 May 2022 06:12 IST
కారు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
ఖమ్మం మిషన్‌ భగీరథ కార్యాలయంలో విషాదం

సారయ్య, సుజాత (పాత చిత్రం)

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బాల్యమిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని భార్యతో కలిసి వెళ్తున్న ఆ ఉద్యోగి గమ్యస్థానం చేరకుండానే అనంత లోకాలకు చేరారు. ఖమ్మం మిషన్‌ భగీరథ ఇంట్రా విభాగం డివిజన్‌ కార్యాలయంలో సహాయ టెక్నికల్‌ అధికారిగా పనిచేస్తున్న తాడూరి సారయ్య (55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ శాఖలో తీవ్ర విషాదం అలుముకుంది. భార్య సుజాతతో కలసి ఆదివారం ఉదయం సొంత కారులో హుజూరాబాద్‌ వెళుతూ వరంగల్‌ హంటర్‌ రోడ్‌లోని ఆర్వోబీ పైనుంచి ప్రమాదవశాత్తు కారు కింద పడిపోవటంతో దంపతులు దుర్మరణం చెందారు. శనివారం రాత్రి 8 గంటల వరకు కార్యాలయంలో తమతో కలిసి పనిచేసిన వ్యక్తి మృతిని సహచర ఉద్యోగులు జీర్ణించుకోలేకపోయారు. తన బాల్య స్నేహితుడు ఒకరు ఇటీవల మరణించారని, అతని కుటుంబానికి సాయం అందించాలని రూ.1.70 లక్షలు సేకరించారని, దశదిన కర్మకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సహచర ఉద్యోగి ఉప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

డిప్యూటేషన్‌పై ఖమ్మంలోనే..

సారయ్య కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం రాజపల్లి గ్రామవాసి. ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగంలో ఏటీవోగా కల్లూరులో నాలుగు సంవత్సరాలు, ఖమ్మంలో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. ఉద్యోగుల స్థానికత, నూతన జోనల్‌ విధానం అమల్లో భాగంగా ఆయన ఆర్నెల్ల క్రితం జనగామ జిల్లాకు బదిలీ అయ్యారు. తర్వాత డిప్యూటేషన్‌పై ఖమ్మంలోనే పనిచేస్తున్నారు.

కుమారుడూ రోడ్డుకే బలయ్యాడు..: సారయ్య, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు విజయ్‌కుమార్‌ 2020 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో మరణించారు. కుమార్తె విద్యారాణికి జనవరిలో ఖమ్మంలో వివాహం చేశారు. పెద్ద కుమారుడు వినయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రుల మరణవార్త తెలియగానే వరంగల్‌ చేరుకున్న అతను తల్లడిల్లిపోయాడు. ఎంజీఎం ఆసుపత్రిలో సారయ్య, సుజాత భౌతిక కాయాలకు శవపరీక్ష నిర్వహించి కుమారుడికి అప్పగించారు. అంత్యక్రియలు సోమవారం తమ స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు వినయ్‌కుమార్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సహచర ఉద్యోగులు సారయ్య దంపతుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని