logo

Revanth Reddy: ముఖ్యమంత్రి.. ముత్యాల తలంబ్రాలు తెచ్చేనా..?

భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

Updated : 14 Mar 2024 07:52 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రసామి దేవస్థానంలో ఏప్రిల్‌ 17న శ్రీరామనవమి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ప్రచార గోడపత్రికలను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారు. ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను ఆలయాధికారులు అందిస్తున్నారు. స్వాగత ద్వారాలు ఏర్పాటుచేయనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి అధికారికంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకురావటం ఆనవాయితీ. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీరామనవమి వేడుకలకు వస్తానని ఇటీవల భద్రాచలం పర్యటన సందర్భంగా వెల్లడించారు. అయితే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. కోడ్‌ అమల్లోకి వస్తే ప్రజాప్రతినిధులకు ఆలయాల్లో   ప్రొటోకాల్‌ వర్తించదు. ఈ పరిస్థితుల్లో సీఎం వస్తారా? లేదా? అన్నది సందిగ్ధంగా మారింది.

ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని..

భద్రాచలం రాములవారికి పాలకులు ముత్యాల తలంబ్రాలు తీసుకురావటమనేది శతాబ్దాలుగా సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి తరుణంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా తలంబ్రాలను తీసుకొచ్చే అవకాశం సీఎంకు కల్పించాలని లేఖ ద్వారా కోరనున్నారు. ఆలయాన్ని నిర్మించిన భక్తరామదాసు కాలంలో చోటుచేసుకున్న ఘటనల సారాంశాన్ని పొందుపర్చి, తానీషా ప్రభువు స్వయంగా తలంబ్రాలను తీసుకొచ్చిన చరిత్రను లేఖలో వివరించనున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టతకు ఇంకొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది. అనివార్య కారణాలతో ముఖ్యమంత్రి రాకపోతే దేవాదాయశాఖ  కమిషనర్‌తో పాటు ముఖ్యమైన అధికారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగించే వీలుంది. పట్టాభిషేకానికి గవర్నర్‌ రావటం ఆనవాయితీగా వస్తోంది. ఈ రెండు వేడుకలకు సంబంధించిన సెక్టార్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని