logo

చూచువారలకు చూడ ముచ్చట..

కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు.

Published : 18 Apr 2024 06:26 IST

సీతారాముల కల్యాణోత్సవంతో మురిసిన ముల్లోకాలు
భద్రాచలం, న్యూస్‌టుడే

ల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు. ఎంతో విశిష్టమైన తలంబ్రాల వేడుక ప్రతి మదినీ పునీతం చేసింది. జగదేకవీరుడైన రామయ్యకు జగన్మాత సీతమ్మకు నిర్వహించిన కల్యాణంతో భూలోకమంతా పండుగైంది. భక్తులు బ్రహ్మానందభరితులయ్యారు. అందరినీ దరిచేర్చే మా రాజువు నీవేనంటూ దేవనాథ రామానుజ జీయర్‌స్వామి చేసిన ప్రవచనం ఓలలాడించింది. భద్రాచలం రామాలయ ప్రాంగణంలోని మిథిలా మండపంలో బుధవారం నిర్వహించిన సీతారాముల శ్రీరామనవమి కల్యాణం కమనీయమైంది.


జయజయ నీరాజనాల మధ్య ఊరేగింపు

తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తలుపులు తెరవగానే శ్రీరామ నామాలు మార్మోగాయి. కౌసల్య సుపుత్రుడికి సుప్రభాతం పలికి ఆరాధించి ఆ తర్వాత మూలవరులకు అభిషేకం చేశారు. సంప్రదాయ బద్ధంగా ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించారు. కల్యాణమూర్తులను అత్యంత  సుందరంగా అలంకరించి జయజయ   నీరాజనాల మధ్య మాడవీధిలో ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చారు.


అభిజిత్‌ లగ్నంలో..

మంగళసూత్రం చూపుతున్న వేదపండితుడు

మిథిలా మండపానికి ఉదయం 10.30 గంటలకు చేరుకోవాల్సి ఉండగా కాస్త ముందుగా స్వామివారు రావటంతో భక్తులు మురిసిపోయారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా విశ్వమంతా వీక్షిస్తుండగా క్రతువులోని ఒక్కో ఘట్టాన్ని స్థానాచార్యులు స్థలసాయి వివరించారు. విష్వక్సేనుల వారిని అర్చకులు ఆరాధన, పుణ్యాహ వాచనం చేసి పుండరీకాక్ష మంత్రం పఠించారు. సీతారాముల కన్నబిడ్డలం మనమంతా.. జగదానందకారకుడి జగమంత కుటుంబం మనం.. అంటూ సుభాషించారు. ఆ మూర్తులకు శరణాగతులం కావటమే ఆత్మ నివేదనగా అభివర్ణించారు. ఇలాంటి గొప్ప కల్యాణం వీక్షించటం వరం అని తెలిపారు. కన్యావరుణ చేసి సీతమ్మకు యోక్త్రధారణ, రాముడికి యజ్ఞోపవీత ధారణ అనంతరం ప్రవరను పఠించారు. గోత్ర నామాల విశిష్టతను వివరించారు. అభిజత్‌ లగ్నంలో సీతారాముల వారి శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. మాంగళ్య ధారణ చేశారు. వాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మూడో మంగళ పతకం ఈ కల్యాణంలో ప్రత్యేకతను చాటింది.

తలంబ్రాల వేడుక


తిరువీధి సేవలో అడుగడుగునా హారతులు

ముత్యాల హారం ప్రదర్శన

ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది అక్షత. వీటిని వాడుక భాషలో అక్షింతలు అని అంటుంటారు. ఈ తలంబ్రాల వేడుక నయనానందకరంగా సాగింది. ముత్యాలతో కలిపి ఉన్న తలంబ్రాలు స్వామివారి మీద పడగానే ప్రాంగణంలో ఉన్నవారంతా పెద్ద పెట్టున జైశ్రీరాం అంటూ తమ సంతోషాన్ని చాటారు. ఈ తలంబ్రాలను ఎలాగైనా తీసుకోవాలన్న తహతహ భక్తుల్లో కనిపించింది. కల్యాణం తర్వాత స్వామివారు దేవాలయానికి చేరుకున్నాక రాజభోగం చేసి ఆరాధించారు. తిరువీధి సేవలో నూతన దంపతులకు అడుగడుగునా హారతులు అందించారు. ఈ జంట చూచువారలకు చూడ ముచ్చటైంది. ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌, ఉప ప్రధానార్చకులు ఎ.మురళీకృష్ణమాచార్యులు, శ్రీమన్నారాయణాచార్యులు, గోపాలకృష్ణమాచార్యులు, రామస్వరూప్‌, వేదపండితులు, వైదిక బృందం క్రతవు నిర్వహించగా ఉత్సవ ఏర్పాట్లను  ఈఓ రమాదేవి పర్యవేక్షించారు.


మిగిలిన టికెట్లు..

కల్యాణ మండపంలో గతంతో పోల్చితే రద్దీ తగ్గింది. టికెట్లు దాదాపు 40 శాతం మిగిలినట్లు అంచనా. ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. వసతి లభిస్తుందో లేదోనన్న భక్తుల సందేహాన్ని నివృత్తి చేయలేదు. ఎన్నికల హడావుడి మొదలుకావటంతో నాయకులు, వారి అనుచరులు ఆశించిన మేర రాలేదు. మంత్రులు వచ్చినప్పటికీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో వారితో పెద్దగా శ్రేణులు తరలిరాలేదు. అన్నింటికీ మించి ఉత్సవాలపై అధికారులు సరైన ప్రచారం చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కల్యాణం విజయవంతం కావటం సంతోషం: శాంతికుమారి, సీఎస్‌

కల్యాణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించటం సంతోషకరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి   తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజును అభినందించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ, విదేశాలకు చెందిన భక్తులు రామ కల్యాణం వీక్షించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పట్టాభిషేకం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు.


ఘనంగా తిరువీధి సేవ

భద్రాచలం, న్యూస్‌టుడే: శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి తిరువీధి సేవ ఘనంగా సాగింది. స్వామివారు చంద్రప్రభ వాహనంపై వేంచేసి ప్రధాన కోవెల నుంచి రాజవీధిలో విహరించారు. భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుని హారతులు అందించారు. మరోవైపు ఆలయంలో శ్రీరామ పునర్వసు దీక్షల స్వీకరణ ఘట్టం అట్టహాసంగా మొదలైంది. పసుపు వర్ణ   వస్త్రాలను ధరించిన భక్తులకు రామ మాలలు మెడలో వేసి దీక్షల నియమాలను ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌ వివరించారు. మే 13న దీక్షల విరమణ ఉంటుంది. ఆ రోజు రథోత్సవం నిర్వహించనున్నారు.


శ్రీలలితా విష్ణు సహస్రనామ పుస్తకావిష్కరణ

భద్రాచలం పట్టణం, న్యూస్‌టుడే: భద్రాచలం హరిత హోటల్‌లో శ్రీలలితా విష్ణు సహస్రనామ స్తోత్రాల పుస్తకాన్ని ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ హరినాథ్‌, జస్టిస్‌   శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం న్యాయమూర్తి భానుమతి, భద్రాచలం న్యాయమూర్తి సూరిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఎలైట్‌ ట్రస్ట్‌ నిర్వాహకుడు సునీల్‌ ఆధ్వర్యంలో ముసునూరి శ్రీలక్ష్మి జ్ఞాపకార్థం  ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ పొట్లాలు, పెరుగు అన్నం పంపిణీ కార్యక్రమానికి జస్టిస్‌ హరినాథ్‌ హాజరయ్యారు. న్యాయవాదులు కొడాలి శ్రీనివాసన్‌,  అబ్బినేని శ్రీనివాసరావు, కొడాలి చంటి తదితరులు పాల్గొన్నారు.

చంద్రప్రభ వాహనం మోస్తున్న ఈఓ రమాదేవి, పక్కన దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు

ఐజీ రంగనాథ్‌ దంపతులు

ఎస్పీ రోహిత్‌రాజు

ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని