logo

ఇక లెక్కలే.. మిగిలాయి..!

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు.

Published : 20 Apr 2024 01:49 IST

శ్రీరామనవమి ఆదాయంపై ఆశలు

భద్రాచలం రామాలయం

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. ఉత్సవాలకు అన్ని విధాలుగా రూ.3 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. అంతకు మించి రాబడి రావాల్సి ఉంది. ఎన్నికల హడావుడి, విపరీతమైన ఎండలు, ప్రచార లోపంతో శ్రీరామ నవమి, పట్టాభిషేకం టికెట్ల విక్రయం తగ్గింది. 2.50 లక్షల లడ్డూలను తయారుచేయగా సుమారు 40 వేల లడ్డూలు మిగిలాయి. ఇప్పుడు రద్దీ ఉండడంతో వీటిని ఈ రెండు రోజుల్లో విక్రయించే వీలుంది.

హుండీలపైనే ఆశలు..

కల్యాణం నిర్వహించిన మిథిలా మండపంలో రద్దీ తగ్గినా 17న దాదాపు 30 వేల మంది భక్తులు మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఆ రోజున టికెట్లు లేకుండానే అందరకీ ఉచిత దర్శనాలు కల్పించారు. టిక్కెట్‌లు లేకుండా ప్రవేశం కల్పించడంతో హుండీలో కానుకలు బాగానే వస్తాయని ఆశిస్తున్నారు. 250 క్వింటాళ్ల బియ్యం, 500 కిలోల ముత్యాలతో తలంబ్రాలను తయారు చేశారు. ఇందులో ఒక ముత్యం గల తలంబ్రాల ప్యాకెట్‌ను రామాలయం కౌంటర్‌లో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. పోస్టల్‌ ద్వారా 2 ముత్యాలు గల పొట్లాన్ని రూ.30కి అమ్ముతున్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా రెండు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్‌ను రూ.30కి విక్రయిస్తారా లేక దీన్ని రూ.50 చేస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. కోరుకున్న భక్తులందరికీ తలంబ్రాలను ఇంటికి చేర్చే పని చురుగ్గా సాగుతోంది.

ఇవీ తేలాలి..

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్వామివారి బంగారం, వెండి ఆభరణాల లెక్కలను తేల్చాల్సి ఉంది. ఇప్పటికే ఒక వెండి ఇటుక మాయమైనట్లు ప్రచారమైంది. ఇది ఏమైందో అతీగతీ లేదు. విరాళాల సేకరణలో వచ్చిన అపవాదులను తొలగించాలి. జానకీ సదనాన్ని ప్రారంభించినప్పటికీ ఇంకా ఇందులో ఫర్నీచర్‌ను ఏర్పాటు చేయలేదు. రంగనాయకుల గుట్టపై కొత్తగా ఓ కాటేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ దీన్ని ప్రారంభించలేదు. వీటిని ఉపయోగంలోకి తేవాలి.  అభివృద్ధి పనులకు సర్వేలు జరుగుతున్నందున శంకుస్థాపన చేసేవరకు ప్రత్యేక చొరవ అవసరం. అభివృద్ధి అంశంలో అలసత్వానికి తావివ్వకుండా చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని