logo

ఇన్‌ఛార్జులమయం.. ప్రగతికి గ్రహణం

ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ.. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులు.. సిబ్బంది నియామకాల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఫలితంగా

Published : 08 Aug 2022 03:31 IST

 కొత్త జిల్లాను వేధిస్తున్న సిబ్బంది కొరత  

 రెవెన్యూ శాఖలో సమస్య మరింత తీవ్రం..

నంద్యాల కలెక్టరేట్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ప్రజలకు పారదర్శక పాలన అందిస్తూ.. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. మౌలిక వసతులు.. సిబ్బంది నియామకాల్లో మాత్రం వేగం పుంజుకోలేదు. ఫలితంగా కొత్త జిల్లాలతో మేలు జరుగుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే కలిగింది. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో పలు శాఖలకు ఇన్‌ఛార్జి అధికారులే దిక్కవడంతో ఆశించిన ప్రగతి కరవైంది. ప్రధానంగా రెవెన్యూ శాఖలో సమస్య తీవ్రంగా ఉంది.
నంద్యాల కొత్త జిల్లాగా 29 మండలాలతో ఏర్పాటైంది. ఇంతవరకు బాగానే ఉన్నా మండల స్థాయి నుంచి డివిజన్‌, జిల్లాస్థాయి వరకు అంతా ఇన్‌ఛార్జుల మయమైంది. ఉన్న అధికారులు, సిబ్బందినే కొత్త జిల్లాకు సర్దుబాటు చేశారు. ఫలితంగా పాలన మొత్తం డిప్యుటేషన్లు, ఇన్‌ఛార్జులతోనే నడుస్తోంది. భూ సమస్యలు, పౌర సరఫరాలు, ధ్రువీకరణ పత్రాల సమస్యలు పరిష్కారం కావడం లేదు.  చాలాచోట్ల డిప్యూటీ తహసీల్దార్లు ఇతర స్థానాల్లో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లను మండల కార్యాలయాల్లోకాక జిల్లా, డివిజన్‌ స్థాయిలో ఇన్‌ఛార్జులుగా నియమించడంతో పనుల్లో ప్రగతి కానరావడం లేదు.

అదనపు బాధ్యతలతోనే సరి
చాగలమర్రి, బనగానపల్లి తహసీల్దార్ల పోస్టుల్లో డీటీలే ఉన్నారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో ల్యాండ్‌ రిపోర్ట్‌ డీటీ పోస్టు ఖాళీగా ఉంది. మహానంది ఆర్‌ఐ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. దీంతో రెండు ప్రాంతాల్లో సేవలకు ఇబ్బందిగా మారింది. కేఆర్‌సీసీ డీటీ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టులో నియమించిన వ్యక్తి కలెక్టర్‌ సీసీగా పనిచేస్తున్నారు. డీఎస్‌వో పోస్టుకు సంబంధించి రుద్రవరం ఏఎస్‌వోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో రీఓపెన్‌ కేసులు 116 వరకు ఉన్నాయి. పెద్దఎత్తున దరఖాస్తులు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి చేరుతుండటంతో రెవెన్యూ శాఖపై ఒత్తిడి పెరుగుతోంది.
కలెక్టరేట్‌దీ అదే దారి..
కలెక్టరేట్‌లో సైతం పాలనంతా ఇన్‌ఛార్జుల మయంగా మారింది. డీఎస్‌వో కార్యాలయం నుంచి ముగ్గురు డిప్యూటీ తహసీల్దార్లను తీసుకొచ్చి కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్లలో విధులు అప్పగించడంతో పౌరసరఫరాల శాఖలో పనులు ముందుకు సాగడం లేదు. శిరివెళ్ల, మహానంది డీటీలకు ఇలానే కలెక్టరేట్‌లో విధులు అప్పగించారు. ఆయా మండలాల నుంచి ఒత్తిళ్లు రావడంతో వారు ఇంకా విధుల్లో చేరలేదు. గోస్పాడు సీనియర్‌ అసిస్టెంట్‌, రుద్రవరం ఆర్‌ఐలకు ఇలానే సచివాలయంలో అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఇక్కడ, అక్కడ విధులు నిర్వహించలేక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
సమీక్షలతోనే..
వారంలో ప్రతి సోమవారం స్పందనపై జిల్లా స్థాయిలో సమీక్ష జరుగుతుంది. ఇదే సమయంలో ప్రతి శుక్రవారం శాఖాపరంగా రోజంతా సమీక్షలు జరుగుతున్నాయి. బుధవారంకానీ.. మరో రోజుకానీ.. టెలీ, వీడియో కాన్ఫరెన్సులు సాధారణమయ్యాయి. ఇదే సమయంలో అదనపు బాధ్యతలతో కార్యాలయంలోని దస్త్రాలు తయారు చేయడం, సరిచూడటం వంటి పనులతోనే అధికారులు, సిబ్బంది సరిపుచ్చుతున్నారు. ఇన్‌ఛార్జి బాధ్యతలే కావడంతో కొన్ని మండలాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకొనేందుకు అధికారులు, సిబ్బంది వెనుకాడుతున్నారు. ఫలితంగా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో ప్రజలు వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా స్పందన దరఖాస్తులు సరిగా పరిష్కారం కావడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని