logo

రాఘవుని మహోత్సవం.. నయనమనోహరం

రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం రెండోరోజు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Published : 12 Aug 2022 02:58 IST

మూలరాముల పూజలు నిర్వహిస్తున్న పీఠాధిపతి

మంత్రాలయం, న్యూస్‌టుడే: రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం రెండోరోజు పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చరణల మధ్య బృందావనానికి విశేష ఫలపంచామృతాభిషేకం, అలంకరణ, మహామంగళహారతి ఇచ్చారు. పూజా మందిరంలో సంస్థాన పూజల్లో భాగంగా మూలరాములు, జయరాములు, దిగ్విజయరాములు, సంతాన గోపాలకృష్ణ, వైకుంఠ వాసుదేవతామూర్తులను మండపంలో కొలువుంచి స్వర్ణాభిషేకం నిర్వహించారు. వజ్రవైడూర్యాలు పొదిగిన హారాలతో అలంకరించి భక్తులకు మూలరాముల దర్శనం కల్పించారు. అంతకముందు ప్రహ్లాదరాయలకు పాదపూజ, కనకాభిషేకం, పల్లకోత్సవం నిర్వహించారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థం ప్రముఖులు వేర్వేరు సమయాల్లో వచ్చారు.

నేడు పూర్వారాధనోత్సవం
రాఘవేంద్రస్వామి బృందావనం ప్రవేశించిన రోజును పురస్కరించుకొని నిర్వహించే ఆరాధనోత్సవాల్లో ముఖ్యమైన దినాల్లో పూర్వారాధనోత్సవం శుక్రవారం నిర్వహించనున్నారు. బృందావనానికి విశేషంగా అభిషేకాలు, అలంకరణ నిర్వహిస్తారు. సాయంత్రం ఉత్సవమూర్తి సింహవాహనంపై ఊరేగుతూ దర్శనమిస్తారు. అనంతరం రాఘవేంద్ర అనుగ్రహ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు.

గజవాహనంపై ప్రహ్లాదుడు  
గజవాహనంపై ప్రహ్లాదుడు భక్తులకు దర్శనమిచ్చారు. అలంకృతుడైన స్వామిని పల్లకీలో కొలుదీర్చారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలు, నామసంకీర్తనల మధ్య స్వామి పల్లకీని భక్తుల నడుమ ప్రాకారంలో కనులపండువగా ఊరేగించారు. ఊజంల్‌సేవ మండపానికి చేరుకున్న స్వామిని ఊయలలో కొలుదీర్చారు. పీఠాధిపతి మంగళహారతి ఇచ్చారు. అనంతరం చర్చిగోష్ఠి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలను కనులారు చూసి తరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని