logo

అనువైన స్థలం ఎక్కడో బీసీ చూపించాలి

బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల విషయంలో తాను మోసం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించడం మంచిది కాదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..

Published : 17 Aug 2022 02:51 IST

- ఎమ్మెల్యే కాటసాని

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాటసాని

బనగానపల్లి, న్యూస్‌టుడే: బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల విషయంలో తాను మోసం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించడం మంచిది కాదని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. అనువైన స్థలం ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీసీ చెబుతున్నారని, అనువైన స్థలం ఎక్కడుందో ఆయన తెలుపాలన్నారు. పట్టణంలో 111 ఎకరాల భూమిని గుర్తించి పేదలకు పంచాలని నిర్ణయం తీసుకుంటే ఆయన కోర్టుకు వెళ్లి నిలుపుదల చేశారన్నారు. తాను పేదలకు ఇచ్చే 111 ఎకరాల్లో సర్వే నంబరు 318, 319లో ఎస్సార్బీసీ కాలనీలోని 26 ఎకరాల భూమి ఉందన్నారు. ఈ భూమి పేదలకు అనువుగా ఉంటుందో లేదో చూడాలని హితవు పలికారు. ఆయన అనుచరులతో కోర్టులో వేయించిన భూమిలో ఈ 26 ఎకరాల భూమి కూడా ఉందన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలు లోతట్టు ప్రాంతాలని చెప్పి కోర్టులో వేశారని, ఇప్పుడు తాను చెప్పే స్థలం లోతట్టులో లేదన్నారు. ఇప్పటికైనా అనువైన స్థలం ఆయనే పరిశీలించి పేదలకు ఇవ్వడానికి వీలుంటే వెంటనే కోర్టు నుంచి కేసు ఉపసంహరించుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలను పక్కనబెట్టి మిగిలిన వాటిని పేదలకు ఇచ్చేందుకు సహకరించాలన్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థలం ఉన్నందునే ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. నియోజకవర్గంలో 11,866 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో బనగానపల్లి పట్టణంలో 3,349 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారన్నారు. 2013లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 3,386 మందికి పట్టణంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ పట్టాలు గడువు తీరిపోవడంతోనే కొత్తవారికి ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండేళ్లు దాటితే ఇళ్లు కట్టుకోలేకపోతే పట్టా రద్దు చేసి ఇతరులకు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని బీసీకి తెలియదా అని ప్రశ్నించారు. పేదలకు అన్యాయం చేయకుండా కోర్టు నుంచి కేసు వాపసు తీసుకోవాలని సూచించారు. తాను ఎంపిక చేసిన స్థలం మొత్తం తహసీల్దార్‌, అధికారులు, పత్రికా విలేకర్లు కలిసి పర్యటించి అనువైన స్థలం గుర్తించి తనకు చెబితే వాటినే ఇళ్ల పట్టాలుగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జిల్లెల శంకర్‌రెడ్డి, అబ్దుల్‌ఫైజ్‌, తిమ్మాపురం సురేష్‌రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని