logo

నేర వార్తలు

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురానికి చెందిన ముక్తాపురం నవీన్‌కుమార్‌(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 23 Mar 2023 02:57 IST

వైద్యవిద్యార్థి బలవన్మరణం

నవీన్‌కుమార్‌ (పాత చిత్రం)

ధర్మవరం, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని తారకరామాపురానికి చెందిన ముక్తాపురం నవీన్‌కుమార్‌(23) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, ధర్మవరం 2వ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. చేనేత కార్మికులైన రామాంజనేయులు, రాజమ్మలకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు నవీన్‌కుమార్‌ కర్నూలులో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. బుధవారం తెల్లవారుఝామున ఇంటి బయట షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు రాజమ్మ, రామాంజనేయులు బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా ఒక్కడే కుమారుడు. మొదటి ఏడాది పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. కుటుంబ సభ్యులకు తెలపకుండా మనోవేదన చెందుతుండేవాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాలని పెద్దనాన్న కుమారుడు కార్తిక్‌కు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. తండ్రికి విషయం తెలిసేటప్పటికే నవీన్‌కుమార్‌ ఉరేసుకొని మృతి చెందాడు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


బండ రాయి మీద పడి వ్యక్తి మృతి

ఆళ్లగడ్డ గ్రామీణం, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామానికి చెందిన సి.సుబ్బరాయుడు (52) బండ రాయి మీద పడడంతో మృతి చెందారు. ఏఎస్సై సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన సుబ్బరాయుడు 7 అడుగుల ఎత్తున్న బండ రాయిని పట్టుకుని మూత్ర విసర్జన చేస్తుండగా బండ రాయి విరిగి అతడిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బుధవారం వేకువజామున బంధువులు అతడి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


అంబులెన్సు రాక అల్లాడిన వృద్ధుడు

డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: రైలులో ప్రయాణిస్తూ ఓ వృద్ధుడు డోన్‌ మండలం దొరపల్లె వంతెన సమీపంలో కింద పడి తీవ్ర గాయాలపాలైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉదయం రైల్వే ట్రాక్‌ల మధ్య రైల్వేస్టేషన్‌కు కూత వేటు దూరంలోనే వృద్ధుడు కింద పడి ఉన్నా జీఆర్పీ పోలీసులకు మాత్రం మధ్యాహ్నం 1:50 గంటలకు సమాచారం వచ్చినట్లు తెలిపారు. కనీసం స్టేషన్‌ మాస్టర్‌ నుంచి సమాచారం లేకపోవడం గమనార్హం. అప్పటి నుంచి వృద్ధుడు ఎండలోనే గాయాలతో గొంతెండుతూ ఇబ్బంది పడ్డా పట్టించుకున్నవారే కరవయ్యారు. వృద్ధుడు జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అని జీఆర్పీ పోలీసులు తెలిపారు. బనగానపల్లి మండలంలోని యాగంటికి దైవ దర్శనానికి వెళ్తున్నానని చెప్పినట్లు పేర్కొన్నారు. ఏ రైలులో ప్రయాణిస్తున్నట్లు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. రైలు నుంచి పడటంతో కాలు తొడకు తీవ్ర గాయాలపాలయ్యరు. అంబులెన్సు కోసం ఫోన్‌ చేస్తే 2 గంటలైనా రాలేదని  జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని