logo

అమ్మో.. ఆత్మకూరు ఠాణా

ఆత్మకూరు పోలీసు స్టేషను వివాదాలకు కేంద్రంగా మారుతోంది. న్యాయం కోసం ఠాణా గడప తొక్కిన వారి పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 01 Jun 2023 05:28 IST

స్టేషను నుంచి తరచూ నిందితుల పరారీ
పంచాయితీలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆరోపణలు

ఆత్మకూరులోని పోలీసుస్టేషన్‌

ఆత్మకూరు పోలీసు స్టేషను వివాదాలకు కేంద్రంగా మారుతోంది. న్యాయం కోసం ఠాణా గడప తొక్కిన వారి పట్ల సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసుల విచారణ కంటే పంచాయితీలకే పెద్దపీట వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కేసుల్లో అరెస్టయి స్టేషనులో ఉన్న నిందితులు.. తరచూ పరారవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్టేషను నుంచి పరారైన ఓ యువకుడి శవం చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన గత ఆదివారం ఆత్మకూరులో కలకలం సృష్టించింది. దీన్ని మరిచిపోకముందే.. సీఐ బెదిరించడంతో పాటు దుర్భాషలాడారంటూ ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశారు. వరుస ఘటనలతో పోలీసు స్టేషను మెట్లెక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు.

న్యూస్‌టుడే, ఆత్మకూరు పట్టణం


ప్రాణం ఖరీదు రూ.12 లక్షలు

రహదారిపై బైఠాయించిన దివాకర్‌ బంధువులు (పాత చిత్రం)

ఓ చోరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న ఆత్మకూరు పట్టణానికి చెందిన దివాకర్‌ను పోలీసులు విచారణ నిమిత్తం స్టేషనుకు పిలిపించారు. గత నెల 26వ తేదీ రాత్రి అన్నం తిని చేతులు శుభ్రం చేసుకునే సమయంలో ఆ యువకుడు స్టేషను నుంచి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. 28న ఆ యువకుడి మృతదేహం ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. తమ కుమారుడిని పోలీసులే  లాకప్‌లో చంపేశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. స్టేషను నుంచి పారిపోయినట్లు ఎలాంటి ఆధారాల్లేవంటూ ఆదివారం పోలీసు స్టేషన్ను ముట్టడించారు. మూడు గంటలపాటు రహదారిపై  బైఠాయించారు. మరుసటి రోజు సోమవారం మృతుడి బంధువులు, పోలీసుల మధ్య కుల సంఘాల వారు పంచాయితీ చేసి రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అతని కుటుంబ సభ్యులకు రూ.12 లక్షల డబ్బు, తమ్ముడికి పురపాలక సంఘంలో ఉద్యోగం ఇప్పించేలా, ద్విచక్ర వాహనం, ఆటోలను వదిలేసేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఇప్పటికే రూ.8 లక్షలు బాధితులకు ముట్టజెప్పినట్లు చర్చ సాగుతోంది. ఇంత మొత్తంలో ఎవరు సమకూర్చారన్నది అంతుచిక్కని విషయం. పురపాలక సంఘంలో ఉద్యోగం ఇప్పిస్తామన్న హామీకి ఎవరు పూచీ ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పురపాలక పాలకవర్గ సభ్యులను వివరణ కోరితే.. ఉద్యోగం ఇస్తామంటూ ఎవరికీ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. చోరీ కేసులో స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనం, ఆటో బయటకు రావడం కష్టమేనని పోలీసులే చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక బయటికొస్తేనే యువకుడి మృతిపై వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇరువర్గాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక బయటికొచ్చేది సందేహమేనని పలువురు పేర్కొంటున్నారు.


నిందితుల పరారీ ఇక్కడ మామూలే..

* వివిధ కేసుల్లో అరెస్టు చేసి స్టేషనుకు తీసుకొచ్చిన నిందితులు తరచూ పరారవుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పహారా కాయాల్సిన పోలీసులే వారిని తప్పిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

* డోన్‌కు చెందిన ఓ దొంగను పట్టుకుని స్టేషనుకు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో అతను నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన ఆభరణాల విలువ అధికంగా ఉండటంతో ఆ దొంగ ఓ పోలీసు అధికారికి రూ.1.50 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే పోలీసు స్టేషను నుంచి దొంగను తప్పించేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు.

* ఆత్మకూరులోని గాంధీ పార్కు ప్రాంతంలో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసులో ఎర్రగూడూరుకు చెందిన దొంగను పోలీసులు అనంతపురంలో పట్టుకున్నారు. అతన్ని ఆత్మకూరు స్టేషనుకు తీసుకొచ్చి విచారించిన తర్వాత లాకప్‌లో ఉంచారు. ఉదయాన్నే చూస్తే దొంగ కనపడలేదు. విధి నిర్వహణలో ఉన్న సెంట్రీని అడిగినా ఫలితం లేదు.

* ఆత్మకూరు గరీబ్‌నగర్‌కు చెందిన ఓ దొంగను చోరీ కేసులో పట్టుకుని రాత్రి స్టేషనులో ఉంచారు. సెంట్రీ పోలీసులు విధులు మారే సమయంలో తెల్లవారుజామున 5 గంటలప్పుడు స్టేషను ప్రధాన ద్వారం నుంచే నిందితుడు పరారయ్యాడు.

* ఆత్మకూరులోని తిక్కయ్యస్వామి దర్గా ప్రాంతంలో జరిగిన ఓ దొంగతనం కేసులో ఆటో డ్రైవరు దివాకర్‌ను ఇటీవల అరెస్టు చేసి స్టేషనుకు తీసుకెళ్లారు. గత నెల 26న అతను స్టేషను నుంచి తప్పించుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. మూడు రోజుల తర్వాత శవమై కనిపించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని