logo

ఓట్ల ఆట!

ఆటైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది.

Published : 18 Apr 2024 03:10 IST

కేపీఎల్‌లో నేటి నుంచి సెమీఫైనల్స్‌
గెలుపోటములపై పెరుగుతున్న ఆసక్తి
న్యూస్‌టుడే, ఆదోని ఎస్కేడీ కాలనీ

టైనా.. ఓటైనా ప్రజలకు ఆసక్తికరమైన అంశాలే. ఉత్కంఠ రేకిత్తించే విషయాలే. తరచి చూస్తే ఈ రెండింటి మధ్య పోలికలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎక్కడ నలుగురు కలిసినా.. వీటికి సంబంధించిన విషయాలపైనే చర్చ కొనసాగుతోంది. వయో భేదం లేకుండా సుమారు అందరినీ కట్టిపడేస్తున్న ఆ ఆట.. ఈ ఓటు అంశాలు పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మీరంతా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. చేస్తున్న పనులను పక్కనపెట్టి మరీ ఆటను ఆస్వాధిస్తుంటారు.. మీ ముందుకు కర్నూలు పొలిటికల్‌ లీగ్‌ వచ్చేసింది. ఐపీఎల్‌.. క్రికెట్‌ అభిమానులకే పరిమితం.. కేపీఎల్‌ రాబోయే ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది. ‘ఓటు’స్వామ్యంలో మీరంతా ‘హక్కు’ను వినియోగించుకోండి.. ‘నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే’ అనే భావన వీడి.. ‘నా ఓటుతోనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ అనే స్ఫూర్తిని నింపుకోవాలి. ఐపీఎల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ చూడకపోయినా రీప్లేస్‌లో మళ్లీ చూడొచ్చు. ఇక్కడ ఆ అవకాశం లేదు. ఏ మాత్రం ఏమర పాటుగా ఉన్నా.. అసలైన క్షణంలో స్పందించకున్నా ఐదేళ్ల భవిష్యత్తుపై మీ ముద్ర పడనట్లే. ఓటరూ మేలుకో! ఐపీఎల్‌నే కాదు.. కర్నూలు పొలిటికల్‌ లీగ్‌నూ జయప్రదం చేయ్‌!  భవితవ్యంపై నీ సంతకం చేయ్‌. మంచి ఆటగాళ్లకు జై కొట్టు .. చెడ్డవాళ్లకు ఛీ కొట్టు! జయహో.

తెదేపా జట్టు

ఎంపీ అభ్యర్థులు: బస్తిపాటి నాగరాజు(కర్నూలు), బైరెడ్డి శబరి(నంద్యాల)
ఎమ్మెల్యే అభ్యర్థులు: ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల), కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి(డోన్‌), బీసీ జనార్దన్‌రెడ్డి (బనగానపల్లి), భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి(శ్రీశైలం), టి.జి.భరత్‌ (కర్నూలు), రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), కేఈ శ్యాంబాబు (పత్తికొండ),  వీరభద్రగౌడ్‌ (ఆలూరు), ఆదోని (పార్థసారథి (భాజపా), జయసూర్య (నందికొట్కూరు).

వైకాపా జట్టు

ఎంపీ అభ్యర్థులు: పోచా బ్రహ్మానందరెడ్డి (నంద్యాల), బీవై రామయ్య (కర్నూలు)
ఎమ్మెల్యే అభ్యర్థులు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), కాటసాని రామిరెడ్డి (బనగానపల్లి), వై.సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం), శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి (నంద్యాల), కంగాటి శ్రీదేవి (పత్తికొండ), బ్రిజేంద్రనాథ్‌రెడ్డి (ఆళ్లగడ్డ), బుట్టా రేణుకా (ఎమ్మిగనూరు), ఎ.ఎం.డి.ఇంతియాజ్‌ (కర్నూలు), ఆదిమూలపు సతీశ్‌ (కోడుమూరు), సుధీర్‌ దార(నందికొట్కూరు), విరూపాక్షి (ఆలూరు).


లీగ్‌ ముగిసింది..సెమీ ఫైనల్‌ వచ్చేసింది

  • ఓట్ల పండగకు ఎన్నికల సంఘం నేడు భేరీ మోగించనుంది. రాజకీయ సమరం మరింత వే‘ఢీ’క్కనుంది. ఎన్నికల పోరులో దిగే అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులు అంచనా వేశారు.. ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు అస్త్రశస్త్రాలు సంధించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలు ఉన్నాయి. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి.
  • ఐపీఎల్‌ క్రికెట్‌ జట్టులో ఆడే క్రీడాకారులు తుది జట్టులో చోటు సంపాదించాలంటే ఫిట్‌నెస్‌, రికార్డులు, ఫామ్‌ వంటి పలు అంశాలను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకొని క్రీడాకారులను ఎంపిక చేస్తారు. ఎన్నికల సమయంలో పార్టీ అధిష్ఠానాలు సైతం ఇదే తరహా కసరత్తు చేశాయి. నియోజకవర్గంలో అభ్యర్థికున్న బలం, అనుచరగణం, పనితీరు, ఓటు బ్యాంకు వంటి ఎన్నో అంశాలు పరిశీలిస్తారు. బి-ఫారం చేతికిచ్చే వరకు ఆ పార్టీ తరఫున తుది పోటీదారు ఎవరనేది కొన్ని సందర్భాల్లో అంతుపట్టదు.

ఐపీఎల్‌లో 8 జట్లు.. కేపీఎల్‌లో 2 జట్లు

క్రికెట్‌ ఐపీఎల్‌ పోటీల్లో మొత్తం 8 జట్లు పోటీలో నిలిచాయి. ఒక్కో జట్టు తరఫున 11 మంది క్రీడాకారులు తుది జట్టులో పాల్గొని పోటీ పడతారు. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసినా.. అత్యధిక వికెట్లు తీసినా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సాధిస్తారు.

కర్నూలు, నంద్యాల జిల్లా పరిధిలో మొత్తం 14 నియోజకవర్గాల్లో కలిపి ఒక్కో పార్టీ జట్టులో 14 మంది చొప్పున అభ్యర్థులుంటారు. వీరికి అదనంగా ఎంపీ అభ్యర్థి ఉంటారు. ఇక్కడ ఎవరి ఆట తీరు వారిదే అన్నట్లుగా అభ్యర్థి, పార్టీ సత్తాపైనే విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. బాగా పని చేసినవారు, ప్రజాభిమానం పొందిన వారు గెలుపొందుతారు.


అటు అంపైర్లు.. ఇటు ఈసీ..

  • క్రికెట్‌ మైదానంలో పోటీ పడే జట్లు ఏవైనా ఆట నిబంధనలు విధిగా పాటించాల్సిందే. పోటీ ఆసాంతం క్రీడాకారులు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా ఆడుతున్నారనే విషయాలపై అక్కడ ఉన్న అంపైర్లు, మ్యాచ్‌ రెఫరీలు పర్యవేక్షిస్తుంటారు. ఎవరైనా నియమావళిని అతిక్రమిస్తే ఆ జట్టు క్రీడాకారుడిపై జరిమానాకు సిఫార్సు చేస్తుంటారు.
  • అదే రీతిలో ఎన్నికల సమరంలో ఈసీ(ఎన్నికల సంఘం) పర్యవేక్షిస్తుంది. ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి లెక్కింపు పూర్తయ్యే వరకు ప్రతీ అంశాన్ని ఈసీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అభ్యర్థులెవరైనా నిబంధనలు మీరినా, ఎన్నికల సమయంలో ఇష్టారీతిన వ్యవహరించినా ఈసీ చట్టపరంగా కొరడా ఝళిపిస్తుంది. జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేందుకు ఆస్కారముంటుంది.

లీగ్‌ దశ నుంచి ఫైనల్స్‌ వరకు..

పీఎల్‌ క్రికెట్‌ పోటీలు లీగ్‌ దశ నుంచి ఫైనల్స్‌ పోటీ వరకు జరుగుతుంది. ఇందులో మొదట లీగ్‌ దశ.. ఆ తర్వాత ప్లేఆప్స్‌.. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్‌కు చేరి తలపడతాయి.
ఇక్కడ ఉమ్మడి జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి లీగ్‌ దశ.. నామపత్రాలు దాఖలు నుంచి ప్రచారాలు ముగిసేవరకు సెమీఫైనల్స్‌ దశ.. ఎన్నికల రోజు తుది (ఫైనల్స్‌) పోరు జరుగుతుంది. ప్రధానంగా తెదేపా, వైకాపా పార్టీల (జట్లు) మధ్యే ప్రధాన పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన అభ్యర్థులు అసెంబ్లీ మెట్లు ఎక్కుతారు.


ప్రేక్షకులు.. ఓటర్లు..

స్టేడియంలో తమ అభిమాన క్రీడాకారుడు రాణించాలని.. ఇష్టమైన జట్టు గెలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు.  గెలవగానే సంబరాల్లో మునిగితేలుతారు. ఇటు ఓటు ఆటలోనూ అదే తీరు కనిపిస్తుంది. తమకు నచ్చిన పార్టీ నాయకుడు గెలుపొందాలని ఆశిస్తుంటారు. పార్టీ జెండాలు.. గుర్తు ప్లకార్డులు పట్టుకొని వీధివీధి తిరుగుతారు. గెలుపొందితే ఆనందానికి అవధులుండవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని