జగన్‌ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా

నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

Updated : 26 Apr 2024 06:50 IST

హుళేబీడులో అసంపూర్తిగా పాఠశాల అదనపు తరగతి గదులు

ఆలూరు, న్యూస్‌టుడే: నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల కొరత కారణంగా విద్యార్థులు వరండాల్లోనూ, అర్ధాంతరంగా నిలిచిపోయిన గదుల్లోనూ విద్యనభ్యసిస్తున్నారు.

ఎక్కడెక్కడంటే..

హుళేబీడు ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు సుమారు 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలకు ప్రత్యేక భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాల కోసం కేటాయించిన గదుల్లోనే కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత ఆదోనికి వెళ్లే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్థలం కేటాయించి మూడు గదులు నిర్మించారు. తరువాత రూర్బన్‌ పథకం కింద మరో మూడు గదుల నిర్మాణానికి రూ.24 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు రూ.20లక్షలు ఖర్చు పెట్టి పనులు చేపట్టారు. రూ.10లక్షల వరకు బిల్లులు అందకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో మూడు గదులు అసంపూర్తిగా ఉన్నాయి.

  • పెద్దహోతూరు ఉన్నత పాఠశాలకు గదులు సరిపోకపోవడంతో అప్పట్లో రెండు గదులు నిర్మించారు. పాఠశాలలో దాదాపు 465 మంది విద్యార్థులు ఉన్నారు. పిల్లలకు అనుగుణంగా గదులు లేకపోవడంతో అసంపూర్తిగా ఉన్న గదుల్లోనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. అరికెర ఉన్నత, ఆలూరులోని ప్రధాన ప్రాథమిక పాఠశాల పరిస్థితి అంతే.

నిధులు విదల్చక...

ఆలూరు మండలంలోని హుళేబీడు, పెద్దహోతూరు, అరికెర ఉన్నత, ఆలూరులోని ప్రధాన ప్రాథమిక పాఠశాలలకు తెదేపా హయాంలో రూర్బన్‌ పథకం కింద అదనపు తరగతి గదులు మంజూరు చేశారు. అప్పట్లో భవన నిర్మాణ పనులు సగం వరకు పూర్తయ్యాయి. అయితే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదనపు తరగతి గదుల నిర్మాణాలకు చిల్లిగవ్వ విదల్చకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని