logo

నిత్యం కష్టాలే.. భత్యం కొందరికే

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. ఇలాంటి వారికి విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం అందించాలి. మూడేళ్లుగా కరోనా ప్రభావంతో బడులు సరిగా నడవకపోవడంతో

Published : 12 Aug 2022 03:16 IST

వెల్దండ : ఆటోలో వెళుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, కందనూలు: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది ఆటోలు, సైకిళ్లపై వెళుతున్నారు. ఇలాంటి వారికి విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం అందించాలి. మూడేళ్లుగా కరోనా ప్రభావంతో బడులు సరిగా నడవకపోవడంతో అందలేదు. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌లో పాఠశాలలు ప్రారంభం కావడంతో భత్యం అందించడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు పంపారు. జిల్లాలో 759 మంది విద్యార్థులను అర్హులుగా తేల్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటి వరకు 150 మంది బ్యాంకు ఖాతాల వివరాలను మాత్రమే అంతర్జాలంలో నమోదు చేశారు. మిగిలిన 609 మంది బ్యాంకు ఖాతాలు తీయకపోవడంతో అంతర్జాలంలో వివరాలను నమోదు చేయలేదని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

నిబంధనల ప్రకారం ఇలా...

స్థానికంగా బడులు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని నిబంధనలున్నాయి. విద్యార్థుల నివాస ప్రాంతానికి ప్రాథమిక పాఠశాల కి.మీ., ప్రాథమికోన్నత పాఠశాల 3 కి.మీ., ఉన్నత పాఠశాల 5 కి.మీ. దూరంలో ఉంటే ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యం మంజూరు చేస్తారు. 10 నెలలపాటు చెల్లిస్తారు. ప్రాథమిక 42, ప్రాథమికోన్నత 443, ఉన్నత పాఠశాలల విద్యార్థులు 274 మంది ఎంపికయ్యారు.

జిల్లా వివరాలు..
మొత్తం పాఠశాలలు 825
చదువుతున్న విద్యార్థులు 69,517
రవాణా భత్యానికి ఎంపిక 759

11 మండలాల విద్యార్థులు దూరం..

జిల్లాలో మొత్తం 20 మండలాలుండగా రవాణా భత్యానికి 9 మండలాల విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యారు. పెంట్లవెల్లి, కోడేరు, బల్మూరు, తెలకపల్లి, వెల్దండ, వంగూరు, పదర, లింగాల, అచ్చంపేట, దోమలపెంట, ఉప్పునుంతల మండలాల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేదు. ఈ మండలాల్లోని విద్యార్థులు వసతిగృహాలు, కస్తూర్బాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది సమీపంలోని గ్రామాల పాఠశాలలకు వెళుతున్నారు. ఇప్పటికైనా ఉపాధ్యాయులు స్పందించి అర్హులకు రవాణా భత్యం అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నాం..  : జిల్లాలో 759 మంది విద్యార్థులు రవాణా భత్యానికి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు 150 మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాలు అంతర్జాలంలో నమోదు చేశాం. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలను త్వరగా నమోదు చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఉత్తర్వులిచ్చాం. విద్యార్థుల హాజరు శాతాన్నిబట్టి భత్యం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

- వెంకటయ్య, జిల్లా విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని