logo

నిబంధనలు పక్కనబెట్టి.. ఇటుక బట్టీ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల నిర్వహణ సాగుతోంది. వేసవి ప్రారంభం అవుతుండటంతో ఎక్కడపడితే అక్కడ లైసెన్సులు తీసుకోకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

Published : 03 Feb 2023 03:16 IST

యథేచ్ఛగా అక్రమ వ్యాపారం
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

జిల్లాలో ఓ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీ

మ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీల నిర్వహణ సాగుతోంది. వేసవి ప్రారంభం అవుతుండటంతో ఎక్కడపడితే అక్కడ లైసెన్సులు తీసుకోకుండానే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో ఇటుక బట్టీల వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. అక్కడి అధికారులు తరచూ దాడులు చేస్తుండటం, నల్లమట్టి కొరతతో నిర్వాహకులు తమ వ్యాపారాన్ని పాలమూరు జిల్లాలకు మార్చారు. ఇక్కడ అటవీ భూములు ఎక్కువగా ఉండటం, చెరువుల్లో నల్లమట్టి విరివిగా లభ్యం అవుతుండటంతో వ్యాపారుల చూపు ఈ ప్రాంతంపై పడింది. అనధికారికంగా వెయ్యికిపైగా ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. అందులో 90కి మాత్రమే పూర్తిస్థాయిలో అనుమతులున్నాయి. చాలాచోట్ల వీటిని వ్యవసాయ క్షేత్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తే తప్పని సరిగా రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకోవాలి.  

గుణపాఠం ఏదీ..

గతేడాది జడ్చర్ల సమీపంలోని ఓ ఇటుక బట్టీ వద్దకు ఒడిశా నుంచి ఓ దళారి ద్వారా పెద్ద ఎత్తున కార్మికులను  తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.38వేలు చెల్లించడానికి నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో 12 మంది కార్మికులను బలవంతంగా తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేస్తున్నట్లు ఒడిశాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్త మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, డీజీపీ సహా జిల్లా ఉన్నతాధికారులకు ట్విట్టరులో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో స్థానిక అధికారులు తప్పనిసరి పరిస్థితిలో ఆ ఇటుకబట్టీపై దాడికి వెళ్లాల్సి వచ్చింది. కార్మిక శాఖలో పని చేసేవాళ్లే దాడులకు వస్తున్నట్లు ఉప్పందించడంతో నిర్వాహకులు కార్మికులను ఆగమేఘాల మీద రైలు ఎక్కించి స్వగ్రామానికి పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.

మక్తల్‌ సమీపంలోనూ ఇటుక బట్టీలో గతంలో కార్మికులు, నిర్వాహకులకు పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఒకరినొకరు దాడులు చేసుకునే వరకు వచ్చింది.  

దరఖాస్తు ఇలా..

బట్టీలో భద్రత ప్రమాణాలు పాటిస్తున్నట్లు ధ్రువపత్రం తీసుకోవాలి

కార్మికులకు బ్యాంకు ఖాతా ద్వారానే జీతాలు ఇవ్వాలి.

సెక్యూరిటీ కింద నిధిని కార్మికుల కోసం జమా చేయాలి

ఇటుక బట్టీల స్థలం లీజుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు ఉండాలి

బట్టీల వద్ద వసతి, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలి. చిన్నారులకు మాతృభాషలో విద్యాభాస్యం వంటి సౌకర్యాలు ఉండాలి.

అనుమతులు ఏవీ..?

ఒక్కో ఇటుక బట్టీలో 50-200 మంది కార్మికులు పని చేస్తే కార్మిక శాఖ ఉప కమిషనర్‌(డీఎసీఎల్‌) అనుమతులు ఇవ్వాలి. 20-50 మంది కార్మికులుంటే కార్మిక శాఖ సహాయ కమిషనర్‌(ఏసీఎల్‌) లైసెన్సులు మంజూరు చేయాలి. 20 మందిలోపు కార్మికులు పని చేస్తే స్థానిక కార్మిక శాఖ అధికారి(ఎఎల్‌వో)నుంచి అనుమతులు పొందాలి. చాలాచోట్ల తక్కువ మంది కార్మికులను చూపించి స్థానిక అధికారుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు తీసుకుంటున్నారు. గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్న బట్టీలకు అసలు అనుమతులే ఉండటం లేదు. ఇక్కడ పని చేసే కార్మికుల సంక్షేమాన్ని నిర్వాహకులు విస్మరిస్తున్నారు.  ఉత్తరాది రాష్ట్రాల నుంచి మధ్యవర్తుల ద్వారా కార్మికులను ఇక్కడికి తరలిస్తున్నారు. వీరికి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. బయటకు వెళ్లకుండా బట్టీల పరిసరాల్లోనే గుడిసెలు వేసుకుని దుర్భర స్థితిలో జీవిస్తున్నారు. వారికి స్థానిక భాష రాకపోవడంతో తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారు.


ఇక్కడ అనుమతులు ఉన్న ఇటుక బట్టీల్లోకే కార్మికులు పంపేలా ఉత్తరాది రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. బట్టీల వద్ద మౌలిక వసతులు కల్పించాలి. లైసెన్సులు లేని వాటిపై చర్యలు తీసుకుంటాం.

చంద్రశేఖర్‌, కార్మికశాఖ ఉపకమిషనర్‌, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని