logo

ఆదిలో గుర్తిస్తే అడ్డుకట్ట

ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్‌ రోగులు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. లక్షణాలు మొదటి స్థాయిలో గుర్తించిన వారికి తగిన చికిత్స ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి.

Published : 04 Feb 2023 05:44 IST

చాపకింద నీరులా క్యాన్సర్‌
న్యూస్‌టుడే, పాలమూరు, వనపర్తి న్యూటౌన్‌

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు

ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్‌ రోగులు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. లక్షణాలు మొదటి స్థాయిలో గుర్తించిన వారికి తగిన చికిత్స ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. కానీ వెనుకబడిన పాలమూరు జిల్లాలో అనేక మంది రెక్కాడితేకాని డొక్కాడని పేదలు, నిరక్షరాస్యులే. అలాంటి వారికి రక్త పరీక్షలు చేయించుకునేంత అవగాహన లేదు. దీంతో వారికి వచ్చిన జబ్బు గురించి కూడా తెలియడం లేదు. దీని కారణంగానే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండేళ్ల కిందట ఉమ్మడి జిల్లాలో 474 మంది క్యాన్సర్‌ రోగులు ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 1,260కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..

అన్ని జిల్లాల్లో పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాలు..

క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే జిల్లాలో తగిన చికిత్స అందించడానికి అవకాశం ఉంది. ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం హైదరాబాద్‌కు వెళ్లాల్సిందే. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పాలియేటిక్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాధి బారిన పడిన వారికి తగిన కౌన్సెలింగ్‌ ఇస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 2018 ఏప్రిల్‌ 2న పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసి అక్కడ క్యాన్సర్‌ రోగులకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పిస్తున్నారు. ఆ తర్వాత మిగతా నాలుగు జిల్లాల్లోని ఆసుపత్రుల్లోనూ పాలియేటిక్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి కూడా శైశవ దశలోనే ఉన్నాయి. అన్ని రకాల సదుపాయాలను ఇంకా కల్పించలేదు. ఇప్పుడిప్పుడు సౌకర్యాలను కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి క్యాన్సర్‌ రోగులను చేర్చుకొని, వారికి వైద్య సేవలు   అందిస్తున్నారు.

ఇంటి వద్దకే వెళ్లి సేవలు...: గ్రామాలు, పట్టణాల్లో క్యాన్సర్‌ రోగులకు నేరుగా ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. అందులో ఒక వైద్యుడు, ఐదుగురు స్టాఫ్‌ నర్సులు, ఒక ఫిజియో థెరపిస్టు ఉంటారు. అందరూ వెళ్లి రోగికి ఇంటి దగ్గరే సపర్యలు చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండి మంచానికే పరిమితం అయిన వారికి ఫిజియోథెరపి చికిత్స కూడా అందిస్తున్నారు. వైద్యులు, స్టాఫ్‌ నర్సులు వారికి మందులను ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. రోగుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేళకు ఇవ్వాల్సిన మందులు, వారికి అందించాల్సిన సేవలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు. నెలకు సరిపడా మందులను ఇస్తున్నారు. ప్రతిరోజు కొన్ని గ్రామాల చొప్పున ప్రత్యేక వాహనంలో తిరుగుతున్నారు. అన్ని జిల్లాల్లో పాలియేటివ్‌ కేర్‌ కేంద్రాలు ఉండటంతో అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నారు.


వివిధ కారణాలు..

ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్‌ రోగులు పెరగడానికి వివిధ కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో వాయు కాలుష్యం కారణంగా పలువురు ఊపిరి తిత్తుల క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. గుట్కాలు, జర్దాలు, పొగాకు ఉత్పత్తుల వాడకం కారణంగా కూడా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల బీడీ కార్మికులు అధికంగా ఉన్నారు. నిత్యం పొగాకుతో బీడీలు చుడుతున్నవారిలో కూడా క్యాన్సర్‌ బాధితులు ఉన్నట్లు తెలిపారు. నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి తదితర జిల్లాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గంజాయి మొక్కలను పెంచుతున్నారు. అక్కడ ఎక్కువగా గంజాయి వాడకం కారణంగా క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు.


మంచి సేవలు అందిస్తున్నాం..: క్యాన్సర్‌ బారిన పడిన వారికి సాంత్వన కల్పించడానికి పాలియేటివ్‌ కేర్‌ సెంటర్ల ద్వారా మంచి సేవలు అందిస్తున్నాం. ఇంట్లో ఉన్నవారికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి రోగులను సెంటర్‌కే  రప్పించుకుంటున్నాం. కొన్ని రోజుల పాటు వారు ఇక్కడే ఉండి వెళ్తున్నారు. వారికి సిబ్బంది అన్ని రకాల సేవలు అందిస్తున్నారు. రోగులకు పౌష్టికాహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. గుడ్లు, పాలు, ఇతర ఆహార పదార్థాలను అందిస్తున్నాం.

డా.సంధ్యాకిరణ్మయి, క్యాన్సర్‌ నోడల్‌ అధికారి, మహబూబ్‌నగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని