logo

శిథిల వారధులపై శీతకన్ను

కొల్లాపూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌, వనపర్తి, పెబ్బేరు, నల్లమల, కృష్ణాతీర గ్రామాలకు రాకపోకలు గల రహదారుల మధ్యలో వాగులపై నిర్మాణం చేసిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి.

Published : 04 Feb 2023 05:44 IST

న్యూస్‌టుడే, కొల్లాపూర్‌ 

జటప్రోల్‌ వంతెన పరిస్థితి ఇదీ..

కొల్లాపూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌, వనపర్తి, పెబ్బేరు, నల్లమల, కృష్ణాతీర గ్రామాలకు రాకపోకలు గల రహదారుల మధ్యలో వాగులపై నిర్మాణం చేసిన వంతెనలు ప్రమాదకరంగా మారాయి. చాలా ఏళ్లుగా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. ప్రతి ఏటా దెబ్బతిన్న వంతెనలు గుర్తించి ప్రతిపాదనలు చేసి సంబంధిత రోడ్లు, భవనాలశాఖ అధికారులు వదిలేస్తున్నారు. దీంతో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. అయినా మరమ్మతులను పూర్తిగా విస్మరించారు. ఈ ప్రమాదకర వంతెనల దుస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలన కథనం.

పరిస్థితి ఇలా..

* కొల్లాపూర్‌ నుంచి ఎల్లూరు, మొలచింతలపల్లి, నార్లాపూర్‌ గ్రామాలకు గల రహదారుల మధ్యలో వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎల్లూరు శివారులో ఎంజీకేఎల్‌ఐ, మిషన్‌ భగీరథ, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. కానీ ఎల్లూరు గ్రామానికి సమీపంలోని చిన్నవాగుపై 30 ఏళ్ల క్రితం వంతెన నిర్మాణం చేశారు. ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నది. కింద ఇనుపకడ్డీలు తేలి సిమెంట్‌ రాలిపోతున్నది. మొలచింతలపల్లి వాగుపై నిర్మించిన వంతెనకు మరమ్మతులు లేవు. శ్రీశైలం తిరుగుజలాలు నిల్వ, వాగునీళ్ల ప్రవాహంతో ఈ వాగుపై వంతెన నిర్మాణం 40 ఏళ్ల క్రితం నిర్మించారు. నేటికి కూడా మరమ్మతులకు మోక్షం లేక పట్టించుకోవడం లేదు.
* కొల్లాపూర్‌ నుంచి వనపర్తి మధ్యలో కొల్లాపూర్‌ మూలవాగు ప్రాంతంలో, సింగోటం, తెల్లరాళ్లపల్లి ప్రాంతాలలో వాగులపై నిర్మించిన వంతెనలకు చాలా ఏళ్లుగా మరమ్మతులు లేవు. ఈ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి.
* కొల్లాపూర్‌ నుంచి పెబ్బేరుకు వెళ్లే మధ్యలో జటప్రోల్‌ దగ్గర వంతెన పూర్తిగా దెబ్బతిన్నది. శ్రీశైలం తిరుగుజలాలు నిల్వతో ఈ వాగుపై వంతెన నిర్మించారు. 40 ఏళ్లు అవుతున్న మరమ్మతులను విస్మరించారు. ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో వంతెన అడుగుభాగంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. పైన రహదారి దెబ్బతిన్నది. అదే విధంగా పెంట్లవెల్లి నుంచి మాధవస్వామినగర్‌ మధ్యలో వంతెన, కొల్లాపూర్‌ నుంచి చౌటబెట్ల, తాళ్లనర్సింహాపురం మధ్యలో వాగులపై వంతెనలు శిథిలావస్థకు చేరాయి. వీటికి కూడా మరమ్మతులు లేవు. ఇప్పటికైనా ప్రమాదకరంగా మారిన ఈ వంతెనలకు మరమ్మతులు చేసి రాకపోకల ఇబ్బందులు తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు, ద్విచక్ర వాహన చోదకులు కోరుతున్నారు.
* వంతెనల ప్రమాదకర పరిస్థితులను ‘న్యూస్‌టుడే’ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా స్పందించారు. సంబంధిత అధికారులకు చెప్పి దెబ్బతిన్న వంతెనలను గుర్తించి మరమ్మతులకు ప్రతిపాదనలు చేయాలని ఆదేశిస్తామన్నారు. ఇప్పటికే కొన్ని వంతెనలకు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

కొల్లాపూర్‌ మూలవాగుపై వంతెన రక్షణగోడలు దెబ్బతిన్న దృశ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని