logo

సమన్వయలోపం.. పౌరసేవలకు ఆటంకం

ప్రతి పంచాయతీ కార్యాలయంలో అంతర్జాల వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులో తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను అందజేసింది.

Published : 24 Mar 2023 05:29 IST

ధరూరు: వామన్‌పల్లి పంచాయతీలో కంప్యూటర్‌

గద్వాల న్యూస్‌టుడే: ప్రతి పంచాయతీ కార్యాలయంలో అంతర్జాల వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులో తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లను అందజేసింది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకపోవటంతో అవి దిష్టిబొమ్మల్లా మారాయి. పూర్తి స్థాయిలో అన్ని పంచాయతీలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు మిషన్‌ భగీరథ పనులతో పాటు అంతర్జాల కేబుల్‌ లైన్‌ వేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 255 పంచాయతీలు ఉండగా 90 శాతం కేబుల్‌ లైన్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచాయతీల్లోని అంతర్జాల వ్యవస్థకు అనుసంధానం విషయంలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించటం లేదు.

కనెక్టివిటీ ఇచ్చేదెప్పుడు

ఈ పంచాయతీ వ్యవస్థలో భాగంగా తొలుత మండల కేంద్రాల్లోని పంచాయతీలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి అందజేశారు. వాటికి ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేక లోకల్‌ నెట్‌ ద్వారా లేదా పంచాయతీ కార్యదర్శుల చరవాణుల ద్వారా ఆన్‌లైన్‌ వివరాలు నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. టీఎస్‌ ఫైబర్‌ నెట్‌ కేబుల్‌ జిల్లాలో 220 పంచాయతీలకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. పంచాయతీల్లోని అంతర్జాల వ్యవస్థకు కనెక్టివిటీ మాత్రం చేయలేదు. అసలు పంచాయతీల పాలక వర్గాల గడువు వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. ఐదేళ్లు గడుస్తున్నా ఈ పంచాయతీ వ్యవస్థలో పురోగతి కనిపించటం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీల్లో ఇబ్బందులు

పల్లె ప్రగతి పనులు, నిధుల ఖర్చు, ఇతర అభివృద్ధి పనుల పురోగతి, జనన, మరణ, ఇంటి అనుమతులు, ఇతరత్రా అనుమతుల పత్రాలు ఆన్‌లైన్‌ ద్వారా పంచాయతీ కార్యాలయాల్లో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ నమోదు పనులన్నీ స్థానికంగా ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో టీఎస్‌ ఫైబర్‌ నెట్‌ కనెక్టివిటీ పంచాయతీలకు అందిస్తే ఉపయోగంగా ఉంటుంది. అసలు కనెక్టివిటీ ఇవ్వాల్సింది ఎవరనే విషయంపై కూడా స్పష్టత లేదు. ఈ కారణంగా ఆయా పంచాయతీలకు పంపిణీ చేసిన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఉన్నచోటే దుమ్ము పట్టిపోతున్నాయి.

జిల్లాలో పంచాయతీలు 255
సామగ్రి పంపిణీ అయినవి 214
కేబుల్‌ అందుబాటులో ఉన్నవి 220


అనుసంధానం చేయాల్సింది వారే : కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు అందజేయాల్సి బాధ్యత మాత్రమే మాది. కనెక్టివిటీ అనుసంధానం చేయాల్సిన బాధ్యత టీఎస్‌ ఫైబర్‌ పనులు చేపడుతున్న సంస్థ వారిది. జిల్లాలో చాలా వరకు పంచాయతీలకు కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు అందుబాటులో ఉన్నాయి. కనెక్టివిటిదే సమస్య ఉంది.

శ్యామసుందర్‌, జిల్లా పంచాయతీ అధికారి, జోగులాంబ జిల్లా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు