logo

విలక్షణ తీర్పుల వేదిక మక్తల్‌

కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మక్తల్‌ నియోజకవర్గానికి రాజకీయంగా విభిన్న పార్టీలను ఆదరించిన ఘనత ఉంది.

Published : 11 Nov 2023 06:16 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే : కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని మక్తల్‌ నియోజకవర్గానికి రాజకీయంగా విభిన్న పార్టీలను ఆదరించిన ఘనత ఉంది. నియోజకవర్గంలోని తంగిడి గ్రామం వద్ద కృష్ణానది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. తూర్పున దేవరకద్ర, పడమరాన కర్ణాటక, ఉత్తరాన నారాయణపేట, దక్షిణాన గద్వాల నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్న ఈ నియోజకవర్గం మీదుగా అంతర్రాష్ట్ర రహదారితో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలకు రైల్వే ప్రయాణ సదుపాయం ఉంది. జూరాల ప్రాజెక్టుతో పాటు భీమా మొదటి దశ ఎత్తిపోతల పథకం, రామన్‌పాడు జలాశయాలు సాగునీటి అవసరాలు తీరుస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలోని చేనేతతో పాటు బీడీ పరిశ్రమ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాయి.

 2009 శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో మక్తల్‌ నియోజకవర్గంలోని నారాయణపేట, దామరగిద్ద మండలాలను తొలగించి, కొత్తగా ఏర్పడిన నారాయణపేట నియోజకవర్గంలో చేర్చారు. రద్దయిన అమరచింత శాసనసభ నియోజకవర్గం నుంచి ఆత్మకూరు, నర్వ మండలాలను మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోకి కలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు అనంతరం నియోజకవర్గంలో కొత్తగా అమరచింత, క్రిష్ణా మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోకి మక్తల్‌, క్రిష్ణా, మాగనూర్‌, ఊట్కూర్‌, నర్వ, అమరచింత, ఆత్మకూరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలతో పాటు మదనాపురం మండలంలోని మూడు, మరికల్‌ మండలంలోని మూడు, ధన్వాడ మండలంలోని ఒక గ్రామ పంచాయతీ వస్తుంది. నియోజకవర్గం పూర్తి స్థాయిలో పది మండలాల గ్రామాలతో విస్తరించింది.

  •  నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్‌, జనతాదళ్‌, తెలుగుదేశం పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులను సైతం ఆదరించింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన బసప్ప.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నా గెలిపించారు. 1972లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కల్యాణి రాంచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనతాపార్టీ నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన చిట్టెం నర్సిరెడ్డి 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏల్కోటి ఎల్లారెడ్డి 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తన రాజకీయ గురువుగా భావించే చిట్టెం నర్సిరెడ్డిని ఓడించారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వారిలో కల్యాణి రాంచందర్‌రావు, ఏల్కోటి ఎల్లారెడ్డిలకు మంత్రి పదవులు వరించాయి. వీరిద్దరూ రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రులుగానే కొనసాగారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన చిట్టెం నర్సిరెడ్డి 15ఆగస్టు 2005న నారాయణపేట పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మావోయిస్టుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘనటలో ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు అంగరక్షకులు చనిపోయారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విజయం సాధించారు.
  • నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అమరచింత శాసనసభ స్థానానికి రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన కొత్తకోట దయాకర్‌రెడ్డి మక్తల్‌ స్థానం నుంచి మూడోసారి గెలుపొందారు.
  • 1983లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభంజనం కొనసాగినా మక్తల్‌ శాసనసభ స్థానంలో మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నర్సింహులు నాయుడు సమీప జనతాపార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ఎల్లారెడ్డికి ధరావతు దక్కలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని