logo

విద్యుత్తు సరఫరా లేక నిలిచిన వైద్య పరీక్షలు

పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్‌ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్‌ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ డిస్ట్రిక్ట్‌ హబ్‌) స్కానింగ్‌ సెంటర్‌లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Published : 20 Apr 2024 03:45 IST

స్కానింగ్‌కు వచ్చిన రోగులు

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని నర్సింగాయపల్లి ఎంసీహెచ్‌ ఆసుపత్రి వెనుక ఉన్న టీ హబ్‌ (తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ డిస్ట్రిక్ట్‌ హబ్‌) స్కానింగ్‌ సెంటర్‌లో విద్యుత్తు లేక పరీక్షకు వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు స్కానింగ్‌ కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంటు కోసం ఎదురు చూశారు. ఇక్కడ జనరేటర్‌ సామర్థ్యం తక్కువ ఉండటంతో స్కానింగ్‌ పరికరాలు పనిచేయ లేదు. కేంద్రం మేనేజర్‌ సెలవులో ఉండటంతో విద్యుత్తు అధికారులతో మాట్లాడగా వారి నుంచి సరైన స్పందన లేక పోవడంతో పరీక్షలకు అలస్యమైందని సిబ్బంది తెలిపారు. స్కానింగ్‌ సెంటర్‌లో 50 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌ ఉంది. దీంతో మిషన్స్‌ ఆన్‌ కాలేదు. అవి ఆన్‌ కావాలంటే 200 కేవీ సామర్థ్యం ఉన్న జనరేటర్‌ కావాలని అక్కడి సిబ్బంది తెలిపారు. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి స్కానింగ్‌ కోసం 30 నుంచి 40 మంది వరకు ప్రజలు వస్తుంటారు. టీ హబ్‌లో అన్ని వసతులు కల్పించాలని రోగులు కోరుతున్నారు.


బ్రేకర్‌ కావాలని అధికారులకు ప్రతిపాదనలు

టీ హబ్‌ సెంటర్‌లో జనరేటర్‌ సామర్థ్యం తక్కువ ఉంది. బ్రేకర్‌ కావాలని విద్యుత్తు అధికారులకు గతంలో ప్రతిపాదనలు పంపాం. కరెంట్ లేదని సమాచారం వచ్చిన వెంటనే విద్యుత్తు శాఖ ఏఈకి ఫోన్‌ చేశాను. తీగలపై చెట్టు కొమ్మలు విరిగి పడి అంతరాయం కలిగిందని మరమ్మతు చేస్తున్నామని చెప్పారు.

బంగారయ్య, ఆర్‌ఎంవో


అంబులెన్స్‌లో సేవలందించారు

మాది పాన్‌గల్‌ మండలం దొండాయపల్లి గ్రామం. మా అమ్మకు ఫిట్్స రావడంతో వనపర్తి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లాం. అక్కడ వైద్యులు పరీక్షించి సీటీ స్కానింగ్‌ చేయించుకురావాలని ఇక్కడికి పంపించారు. శుక్రవారం ఉదయం 9.30కి వచ్చాం. కరెంట్ లేకపోవడంతో అంబులెన్స్‌లో ఉంచి చికిత్స అందించారు.

రజిత, దొండాయపల్లి


గంటల తరబడి నిరీక్షణ

మాది పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామం. మా అమ్మకు తల తిరుగుతోందని, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లాం. పరీక్షించిన వైద్యులు తల స్కానింగ్‌కు టీ హబ్‌కు పంపించారు. ఇక్కడికి ఉదయం పది గంటలకు వచ్చాం. కరెంట్ లేదని చెప్పడంతో గంటల తరబడిగా ఎదురుచూస్తున్నాం.

 రాకేశ్‌ గౌడ్‌, చిన్నమందడి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని