logo

కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు

దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పాలనాధికారి

Published : 24 Jan 2022 01:05 IST

మంత్రి హరీశ్‌రావు

సమీక్ష నిర్వహిస్తున్న హరీశ్‌రావు, చిత్రంలో ఎంపీ బీబీపాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు

మంజుశ్రీ, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పాలనాధికారి కార్యాలయంలో దళితబందు పథకం అమలుకు కార్యాచరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టగా.. విజయవంతం అయిందన్నారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి అమలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. నిర్దేశించిన గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి.. వారి పేరు మీద బ్యాంకు ఖాతాలు తెరిపించాలన్నారు. వారు కోరుకున్న యూనిట్‌కు సంబంధించి శిక్షణ ఇవ్వడం, గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుని వాటా రూ.10వేలు, ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఫిబ్రవరి 5లోగా దళితబంధుకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మార్చి 7వ తేదీ నాటికి యూనిట్‌ను గ్రౌండింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. పాడి పరిశ్రమకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గేదెలకు వంద శాతం ఇన్సూరెన్స్‌ ఉందన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని లబ్ధిదారులు సరైన నిర్ణయం తీసుకునేలా చూడాలని చెప్పారు. రానున్న రెండేళ్లలో సర్కారు పాఠశాలలను బాగు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని తెలిపారు. నీటి సౌకర్యంతో పాటు మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, ఫర్నిచర్‌, పాఠశాలలకు పెయింటింగ్‌, మరమ్మతులు, విద్యుత్‌ సౌకర్యం, డిజిటల్‌ తరగతుల ఏర్పాటు తదితర పనులు చేపడతామన్నారు. మొదటి విడతలో ఎక్కువ మంది విద్యార్థులున్న 35 పాఠశాలల ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్‌, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, క్రాంతి కిరణ్‌, అదనపు పాలనాధికారి వీరారెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ శివకుమార్‌, డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూరావు, వ్యవసాయశాఖ జేడీ నరసింహారావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని