logo

వైద్య కళాశాలకు.. వడివడిగా అడుగులు

వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు వైద్యా కళాశాలను గతేడాది మంజూరు చేసింది. విడతల వారీగా భవనాలు నిర్మించేందుకు

Published : 23 May 2022 02:12 IST

కొలిక్కి వస్తున్న పనులు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌
 


నూతన భవనం

వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లాకు వైద్యా కళాశాలను గతేడాది మంజూరు చేసింది. విడతల వారీగా భవనాలు నిర్మించేందుకు సర్కారు ఆలోచన చేస్తోంది. ఆసుపత్రి ఆవరణలో విద్యార్థుల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి తొలుత (జీ+2) రూ.30 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రీకాస్ట్‌ విధానం అమలుతో వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశాల మేరకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే ఆవరణలో.. ఆ భవనం పక్కనే వసతి గృహాలను రూ.95 కోట్లతో నిర్మించనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది.

వచ్చే ఆగస్టు నాటికి...
2022-23 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం తరగతులను ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. అందులో 150 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం చదివే అవకాశం ఇవ్వనున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 400 పడకలున్నాయి. వైద్య కళాశాల అనుమతులకు విడతల వారీగా పడకల స్థాయిని పెంచుతోంది. ఇప్పటికే రూ.30 కోట్లతో మెడికల్‌ కళాశాల భవనం నిర్మాణ పనులు పనులు కొలిక్కి వచ్చాయి. విద్యుత్‌, టైల్స్‌, కిటికీలు, తలుపులు, ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే రూ.19కోట్ల వ్యయం కాగా. రూ.11 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

ఆధునికీకరణ పనులు

నర్సింగ్‌ విద్యార్థుల కోసం..
నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణానికి రూ.40 కోట్లను ప్రభుత్వం గతేడాది మంజూరు చేసింది. సంగారెడ్డి పట్టణ శివారులోని రామచంద్రారెడ్డి నగర్‌ కాలనీ సమీపంలో నిర్మించాలని స్థలాన్ని సైతం గుర్తించారు. ఆయా భవన నిర్మాణ బాధ్యతను తెలంగాణ ఆసుపత్రులు, వైద్య సేవల మౌలిక సదుపాయల కల్పలా సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ)కి అప్పగించారు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ తరహాలో కట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో.. జిల్లాకు చెందిన సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే అక్కడికి వెళ్లి వచ్చారు. ఇంకా అంచనాలు పూర్తి కాకపోవడం వల్ల టెండర్లు పిలిచేందుకు ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యకేషన్‌ (డీఎంఈ) వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి జిల్లా ఆసుపత్రి పర్యటనలో భాగంగా వచ్చారు. త్వరలో టెండర్లు పిలుస్తామని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


దశలవారీగా పూర్తి చేసేందుకు కృషి
-అనిల్‌, వైద్య కళాశాల పర్యవేక్షకులు, సంగారెడ్డి

ఆగస్టు నాటికి వైద్య కళాశాల భవనం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రధాన పనులు తుది దశకు చేరాయి. ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పూర్తయ్యే వచ్చే నాటికి అన్ని రకాల హంగులతో భవనాన్ని తీర్చిదిద్దుతాం. నర్సింగ్‌ కళాశాల భవనం పనులకు ఈ ఏడాది టెండర్లు పిలుస్తాం. సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. కొత్తగా విద్యార్థులకు వసతి గృహాలు ఆసుపత్రి ఆవరణలోనే నిర్మించాలని ఆలోచన చేశాం. ఎంసీఐ బృందం మరోసారి రావాల్సి ఉంది. కళాశాల భవనాల పనులను పర్యవేక్షించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని