logo

నవతరానికి నైపుణ్య పాఠాలు

పోటీ ప్రపంచంలో ఉపాధి పొందేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) డిగ్రీలో పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. దీనిద్వారా విషయ నైపుణ్యంతోపాటు, మానసిక వికాసానికి దోహదపడేలా పాఠ్య ప్రణాళికను

Published : 25 Jun 2022 01:25 IST

జీవన్‌ కౌశల్‌ కోర్సుతో ఉజ్వల భవిత

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

నేర్చుకుంటున్న విద్యార్థులు

పోటీ ప్రపంచంలో ఉపాధి పొందేందుకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా విశ్వ విద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) డిగ్రీలో పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. దీనిద్వారా విషయ నైపుణ్యంతోపాటు, మానసిక వికాసానికి దోహదపడేలా పాఠ్య ప్రణాళికను రూపొందించింది. ఈ దశలోనే విద్యార్థులకు సరైన మార్గనిర్దేశనం చేయాలన్న లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ జీవన్‌కౌశల్‌ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకునేందుకు అవసరమైన అంశాలను బోధిస్తారు. ఈ నేపథ్యంలో కథనం.

ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా...

జీవన్‌ కౌశల్‌కు గత విద్యా సంవత్సరంలోనే రూపకల్పన చేశారు. అవగాహన లేకపోవడంతో కొందరు మాత్రమే ఇందులో చేరారు. ఈ విద్యా సంవత్సరం ఎక్కువమంది ఈ కోర్సును ఎంచుకునేలా అవగాహన కార్యక్రమాలకు కార్యాచరణ సిద్ధం చేశారు. 8 క్రెడిట్లతో జీవన్‌ కౌశల్‌ కోర్సును రూపొందించారు. నాలుగు అంశాలుగా కోర్సును విభజించారు. ఒక్కో అంశాన్ని 30 గంటలు చెప్పడంతోపాటు రెండు  క్రెడిట్లు ఇస్తారు. ఇలా నాలుగు అంశాలకు కలిపి 120 గంటల్లో కోర్సు పూర్తవుతుంది.

బోధనతో ప్రయోగాలు..

బోధనతోపాటు ప్రాజెక్టు వర్క్‌లు ఉండేలా పాఠ్యప్రణాళికను రూపొందించారు. పాఠం బోధించాక విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించే విధానం అమలులో ఉంది. వారు ఎంత మేరకు నైపుణ్యాలు నేర్చుకున్నారో దీనిద్వారా అంచనా వేస్తారు. తరగతి గదిలోనే రాత, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత కళాశాలలోనే మూల్యాంకనం ఉంటుంది.

వినడం.. చదవడం.. అర్థం చేసుకోవడం

అధ్యాపకుడు బోధిస్తున్నప్పుడు పాఠాలు ఏకాగ్రతతో వినాలి. వాటిని ఇంటికి వెళ్లాకా చదవాలి. అర్థం చేసుకోవడం కూడా అవసరం. ప్రస్తుతం విద్యార్థులకు ఇది కష్టంగా మారింది. దీంతో లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. జీవన్‌ కౌశల్‌ కోర్సులో వినడం, చదవడం, అర్థంచేసుకోవడం.. అంశాలకు ప్రధాన ప్రాధాన్యం ఉంటుంది. ఈ అంశాలకు ప్రత్యేకంగా 17 గంటలు కేటాయించారు. చిత్తు ప్రతులలో రాయించడంతో ప్రారంభించి రచనా నైపుణ్యాలు మెరుగుపరుస్తారు.  

నేర్పించే అంశాలివి..

* నాయకత్వ లక్షణాలు ఉన్న వారికి ప్రస్తుతం అవకాశాలకు కొరత లేదు. ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు అన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వేతనం కూడా ఎక్కువే ఇస్తున్నారు. జీవన్‌కౌశల్‌ కోర్సులో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

* సమాజంలో అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. మానవ విలువలు గుర్తెరిగితే అందరూ బాగుండాలన్న ఆలోచనకు బాటలు పడతాయి. అందుకే ఈ అంశాన్ని పాఠ్యాంశంలో చేర్చారు.

* ఇప్పుడు ఎదుటివారిని మెప్పించగలిగే నేర్పు ఉండటం ముఖ్యం. అలాంటి వారికి సంస్థలు, పరిశ్రమల్లోనూ ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. జీవన్‌కౌశల్‌ కోర్సులో ఇది కూడా ఒక అంశమే.

* విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివేలా తీర్చిదిద్దుతారు. నిర్ధేశించుకున్న లక్ష్యాల సాధనకు సలహాలు, సూచనలు చేస్తారు.


సద్వినియోగంతో  భవిష్యత్తు

-హుమేరా సయీద్‌, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(సంగారెడ్డి)

జీవన్‌ కౌశల్‌ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. కోర్సులో చేరేందుకు ఎలాంటి ఒత్తిడి ఉండదు. విద్యార్థులు ఇష్టపూర్వకంగా కోర్సును ఎంచుకునేందుకు స్వేచ్ఛ ఉంది. జీవన్‌కౌశల్‌లో చేరడం ద్వారా విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చదువుతోపాటు ప్రయోగాలతో విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని