logo

ఏడు నెలలు.. 1348 విద్యుత్తు చౌర్యం కేసులు

విద్యుత్తు వినియోగం తీరుతెన్నుల గణాంకాలు ఎప్పుడు చూసినా సరిపోలటం లేదు. విద్యుత్తు డిమాండ్‌, సరఫరా కోసం ప్రణాళికలు ఒక్కోసారి తారామారు అవుతున్నాయి. విచ్చలవిడిగా వాడటం వల్ల గందరగోళంగా ఉంటోంది.

Published : 10 Aug 2022 01:46 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట అర్బన్‌


అక్రమంగా విద్యుత్తు వాడుకోవడానికి వేసిన కొక్కేలు

విద్యుత్తు వినియోగం తీరుతెన్నుల గణాంకాలు ఎప్పుడు చూసినా సరిపోలటం లేదు. విద్యుత్తు డిమాండ్‌, సరఫరా కోసం ప్రణాళికలు ఒక్కోసారి తారామారు అవుతున్నాయి. విచ్చలవిడిగా వాడటం వల్ల గందరగోళంగా ఉంటోంది. ఉపకేంద్రాలు, నియంత్రికల వద్ద వినియోగం గణాంకాలు నమోదు అవుతున్నాయి. మీటర్ల ద్వారా నమోదు అవుతున్న యూనిట్లకు పొంతన కుదరడం లేదు. సరఫరా నుంచి పక్కకు ఎటు వెళ్తోందో, ఎలా పోతోందో అంతుపట్టక విద్యుత్తు శాఖ అధికారులు లెక్కలను తేల్చటానికి తలమునకలవుతున్నారు. చౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు విజిలెన్స్‌, అధికారులు దాడులు చేస్తున్నారు. కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. జిల్లాలో అక్రమ వినియోగం పెరిగిందని బహిరంగంగానే అధికారులకు తెలుస్తుండటంతో చౌర్యం నష్టాన్ని పూడ్చుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్తు వినియోగంపై డేగ కన్ను వేశారు. 2022 జనవరి నుంచి జులై వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 1348 చౌర్యం కేసులు నమోదయ్యాయి. మీటర్ల వద్ద రీడింగ్‌, కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం, మీటరు ట్యాంపరింగ్‌, స్థానికంగా కొందరు సిబ్బంది సాయంతో అక్రమ కనెక్షన్ల ద్వారా విద్యుత్తు చోరీ జరుగుతోందని తనిఖీల్లో వెల్లడైంది. తనిఖీల నిర్వహణకు సిబ్బంది కొరత వేధిస్తోంది. కనెక్షన్లు పెరుగుతున్నా దానికి అనుగుణంగా సిబ్బంది నియామకం జరగడం లేదు. మీటరుతో సంబంధం లేకుండా కొందరు స్తంభం తీగల నుంచి నేరుగా వాడుకుంటున్నారు. తీగలు సరిచేయడం, నియంత్రికల వద్ద పరిష్కారాలు, బిల్లుల వసూలుకు సిబ్బంది సరిపోతున్నారు. అక్రమ కనెక్షన్లపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తోంది. పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాటర్‌ ప్లాంట్లు, ధాబాలు, చిన్నతరహా పరిశ్రమలు పెట్టుకొని వ్యవసాయానికి సరఫరా చేసే విద్యుత్తును వాడుకుంటున్నారు. ఇది ఉచితం కిందనే జమకడుతున్నారు. ఈ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

నెలలో మూడు రోజుల పాటు తనిఖీలు : - ప్రభాకర్‌, ఎస్‌ఈ, సిద్దిపేట జిల్లా
వినియోగదారులు సక్రమంగా విద్యుత్తు వినియోగించుకోవాలి. అక్రమ వినియోగదారులు పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నాం. జరిమానా విధిస్తున్నాం. రెండోసారి దొరికితే జైలుకు పంపిస్తున్నాం. చౌర్యం నివారణకు ప్రతి నెలలో జల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు డివిజన్‌కు ఒక రోజు అధికారులు, సిబ్బందితో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని