logo

పరికరాలు లేకుండా ప్రయోగాలెలా..?

ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తుకు ఇంటర్‌ నుంచే బీజం పడుతుంది. సైన్స్‌ గ్రూపులు, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రయోగ తరగతులు తప్పనిసరి.

Published : 07 Dec 2022 06:24 IST

నామమాత్రపు తరగతులతో ఫలితం శూన్యం
న్యూస్‌టుడే, మెదక్‌ టౌన్‌, నర్సాపూర్‌, చేగుంట

ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తుకు ఇంటర్‌ నుంచే బీజం పడుతుంది. సైన్స్‌ గ్రూపులు, ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రయోగ తరగతులు తప్పనిసరి. మొదటి నుంచి సాధన చేస్తేనే మంచి ఫలితాలుంటాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వ కళాశాలల్లో సదుపాయాలు లేకపోవడంతో ప్రయోగ తరగతులు తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. అవసరమైన రసాయనాలు, ఇతర పరికరాల కొరతతో ఇక్కట్లు తప్పడంలేదు. చాలాచోట్ల హడావిడిగా కొన్ని కళాశాలలను ప్రారంభించిన ప్రభుత్వం ప్రయోగశాలల సదుపాయాలను కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో తీరుపై పరిశీలనాత్మక కథనం..

మెదక్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో..

పక్కా భవనాలున్నా..

జిల్లా వ్యాప్తంగా మొత్తం 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా, 14 చోట్ల పక్కా భవనాలు ఉన్నాయి. శివ్వంపేట, నార్సింగి మండలాల్లో 10 ఏళ్ల క్రితం ఏర్పాటైనా సొంత భవనాలు లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. అటు పాఠశాల, ఇటు కళాశాల విద్యార్థులకు సరిపడా గదులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు, పరికరాలు లేకపోవడంతో ఆయా అంశాల్లో వెనుకబడుతున్నారు.

రూ. 3కోట్లతో నిర్మించినా..

మెదక్‌ పట్టణంలో నాలుగు ఏళ్ల క్రితం రూ.3 కోట్లతో నిర్మించిన బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రథమ, ద్వితీయ విద్యార్థినులు 600 మంది ఉన్నారు. వారి సంఖ్యకు తగినట్లు సరిపడా తరగతి గదులు లేకపోవడంతో  ప్రయోగశాలలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ప్రయోగశాలలోని పరికరాలను తొలగించడంతో ప్రయోగాలు చేసేందుకు అవకాశం లేకపోయింది. 

నర్సాపూర్‌లో బీరువాలో పరికరాలు

ప్రత్యేక గదులు కరవు..

జిల్లాలో పక్కా భవనాలున్న కళాశాలల్లోనూ పరికరాలు, రసాయనాలు అందుబాటులో లేవు. దీంతో ప్రయోగ తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించడం లేదు. ఫలితంగా ప్రైవేట్‌ పాఠశాలలతో పోల్చుకుంటే మెరుగ్గా రాణించలేకపోతున్నారు. ఫలితంగా ఉత్తీర్ణత శాతం సైతం తగ్గుతుంది. కొన్నిచోట్ల ప్రత్యేక గదులు లేకపోవడంతో ప్రయోగ పరికరాలు మూలకు, బీరువాల్లో ఉంటున్నాయి. ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్‌ విద్యార్థులకు బోధన తరగతులు పూర్తయిన ప్రయోగాలు చేయించలేకపోతున్నారు.


నిధులు విడుదల కావడం లేదు...

- సత్యనారాయణ, ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అన్నింటిలో ప్రయోగశాలలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదు. గతంలో ఉన్న ప్రయోగ పరికరాలు సరిపోవడం లేదు. గతేడాది ప్రయోగశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య పరంగా రూ.4-5 వేలు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయి. కాగా ఈ యేడు ఇంతవరకు విడుదల కాకపోవడంతో నూతన పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేయలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని