logo

పద్దుపై ఆశ..ప్రగతి శ్వాస!

సాగునీటి పథకాలకు నిధులు పారాలి.. సంక్షేమ సరాగం వినిపించాలి.. పర్యాటక ప్రగతి కనిపించాలి.. అన్నదాత మోమున నవ్వులు వికసించాలి.. ఆరోగ్యం మరింత పదిలమవ్వాలి.. ప్రభుత్వ పథకాలకు జిల్లా వాటా పెంచాలి.. విద్య ఉన్నతికి మరిన్ని ఉషస్సులు దరి చేరాలి.. ఇవీ ప్రజల ఆకాంక్షలు.

Published : 04 Feb 2023 01:49 IST

న్యూస్‌టుడే, మెదక్‌, నర్సాపూర్‌: సాగునీటి పథకాలకు నిధులు పారాలి.. సంక్షేమ సరాగం వినిపించాలి.. పర్యాటక ప్రగతి కనిపించాలి.. అన్నదాత మోమున నవ్వులు వికసించాలి.. ఆరోగ్యం మరింత పదిలమవ్వాలి.. ప్రభుత్వ పథకాలకు జిల్లా వాటా పెంచాలి.. విద్య ఉన్నతికి మరిన్ని ఉషస్సులు దరి చేరాలి.. ఇవీ ప్రజల ఆకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్న ఆర్థిక పద్దులో నిధులు వడ్డిస్తారని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. 


 సొంతింటి కల

పేద, మధ్యతరగతి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తోంది. జిల్లాలో 4,790 మందికి గృహాలు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం. ఇప్పటివరకు 2,422 మాత్రమే పూర్తి చేశారు. మరో వేయింటికి టెండర్లు నిర్వహించినా స్పందన లేదు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం ఏ దిశగా అడుగులు పడనున్నాయన్నది వేచి చూడాల్సిందే.


పావలా వడ్డీ

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతీకగా నిలిచే పొదుపు విషయంలో జిల్లాకు తోడ్పాటు అనివార్యం. జిల్లాలోని 13,038 సంఘాలు తీసుకున్న రుణాలు, చెల్లిస్తున్న కిస్తీలకు సంబంధించి పావలా వడ్డీ జిల్లాకు గత నాలుగేళ్లకు సంబంధించి రూ.91.20 కోట్లు విడుదలవ్వాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో మోక్షం లభిస్తే సంఘాల సభ్యులకు సాయం అందుతుంది.


అసంపూర్తిగా మార్కెట్లు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పురపాలికలో సమీకృత మార్కెట్‌, వైకుంఠధామాల నిర్మాణానికి రెండేళ్ల కిందట నిధులు కేటాయించింది. జిల్లా కేంద్రం మెదక్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి గతంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో స్థలం కేటాయించగా, పలువురు హైకోర్టుకు వెళ్లడంతో నీటిపారుదలశాఖ ఎస్‌ఈ కార్యాలయం ఎదుట స్థలాన్ని ఎంపిక చేశారు. నర్సాపూర్‌లో రూ.3 కోట్లతో నిర్మాణం చేపట్టగా రెండు నెలల కిందట నిలిచిపోయాయి. తూప్రాన్‌లో అందుబాటులోకి రాగా రామాయంపేటలో పనులు కొనసాగుతున్నాయి. అన్ని పురపాలికల్లో వైకుంఠధామాల పనులు మందకొడిగా సాగుతున్నాయి. రామాయంపేటలో మల్లె చెరువు వద్ద స్థలం ఎంపిక చేయగా మొదలుకావాల్సి ఉంది.


శిక్షణతోనే ఉపాధి

జిల్లాలో యువతకు ఆయా కోర్సుల్లో శిక్షణ ఇస్తే ఉపాధి లభించనుంది. గతంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ శిక్షణ ఇచ్చేవారు. ఉద్యోగ మేళాలు నిర్వహించి అవకాశాలు కల్పించారు. కరోనా రాకతో నిలిచిపోయాయి. ఉపాధి హామీలో 100 రోజుల పని దినాలు పూర్తయిన కుటుంబాల్లోని యువతకు సైతం తర్ఫీదు ఇచ్చేవారు. ప్రస్తుతం అది అటకెక్కింది. కొన్ని నెలల కిందట జిల్లా యువజన, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మెదక్‌లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక బ్యాచ్‌ పూర్తికాగా, ఇటీవల మరోటి ప్రారంభమైంది. ఇలాంటివి మరిన్ని అవసరం.


ఆరోగ్య సిరి

గ్రామీణ వైద్యాన్ని మెరుగుపరిచేందుకు శిథిలమైన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల మరమ్మతులు, ఇతర అవసరాలకు రూ.30 కోట్లు అవసరం. 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 159 ఉపకేంద్రాల్లో సమస్యలు తీరేలా సాయం అందాలి. 70 ఉపకేంద్రాలకే సొంత భవనాలున్నాయి. నర్సాపూర్‌, రామాయంపేట ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కరవయ్యారు. జిల్లా మీదుగా వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై ట్రామా కేర్‌ కేంద్రం ఏర్పాటుకు గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాల్సి ఉంది. పాపన్నపేట పీహెచ్‌సీలో గదుల నిర్మాణం అసంపూర్తిగా ఉంది.


పర్యాటక శోభకు..

పర్యాటక రంగ వృద్ధికి జిల్లాకు రూ.60 కోట్లు అందాలి. ఇక్కడి చారిత్రక ప్రాంతాలను కలుపుతూ వలయ ప్రగతి ఏర్పాటు ప్రకటన అటకెక్కింది. జిల్లా సరిహద్దులోని పోచారం అభయారణ్యం వద్ద అతిథిగృహాల నిర్మాణానికి నిధులు అవసరం. ఖిల్లా అభివృద్ధి, చర్చి చెంతన ఆధునికీకరణకు నిధుల కేటాయింపు తప్పనిసరి. పుణ్యక్షేత్రం ఏడుపాయల సన్నిధికి రూ.100 కోట్లు కేటాయిస్తామని కొద్ది నెలల క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.


మౌలిక సదుపాయాలు

సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి నిధుల కొరత వేధిస్తోంది. కేవలం రూ.30 లక్షల్లోపు పనులు చేపట్టే వాటికి మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. తొలివిడతలో 313 పాఠశాలలకు 15 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు రూ.5 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో సకాలంలో నిధులు రాక పనులు మందకొడిగా సాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని