logo

ఆ మాస్టారుకు పాఠశాలే లోకం

అద్భుతమైన భవిష్యత్తును పాఠశాలలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. వారి ఆదర్శ విధానాలే పలువిధాలుగా ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

Published : 09 Feb 2023 01:59 IST

నాలుగేళ్లుగా సెలవు పెట్టకుండా విధులు

ఖాజామొహినొద్దీన్‌ను సన్మానిస్తున్న స్థానికులు

పూడూరు, న్యూస్‌టుడే: అద్భుతమైన భవిష్యత్తును పాఠశాలలో తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. వారి ఆదర్శ విధానాలే పలువిధాలుగా ఇతర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం మేడిపల్లికలాన్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎండీ ఖాజామొహినొద్దీన్‌ పని తీరు ఆదర్శంగా నిలుస్తోంది. విధులు చేపట్టినప్పటి నుంచి విద్యార్థులేతన కుటుంబంలా వ్యవహరిస్తున్నారు. ఉత్తమ సేవలతో మన్ననలు పొందుతున్నారు. మన్నెగూడలో ఆయన కుటుంబం ఉంది. ఉపాధ్యాయుడు ఖాజాది పేద కుటుంబం. తండ్రి యూసూఫ్‌ పిండి గిర్ని నడిపించి పోషించారు. కుమారుడు ఖాజా 2010లో మేడిపల్లికలాన్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు చేపట్టారు. ఇంటి నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. నాడు పాఠశాలలో 86 మంది విద్యార్థులు ఉండేవారు. గ్రామం నుంచి 60 మంది ప్రైవేటు పాఠశాలకు వెళ్లేవారు. ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం అనుమతించటంతో అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రైవేటుకు ధీటుగా బోధన చేపట్టారు. ప్రస్తుతం 131 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో 12 మంది గురుకులాలకు ఎంపికయ్యారు. గ్రామం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రైవేటు బడికి వెళ్తున్నారు. ఏ చిన్నారిని కదిలించినా ఆంగ్లంలోనూ ఠక్కున మాట్లాడగలరు. బడిలో ప్రస్తుతం ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. గత నాలుగేళ్ల కాలంగా ఖాజా ఒక్క సెలవైనా పెట్టలేదు. సాధారణ, వైద్య సెలవులూ వాడుకోలేదు. నిరంతరంగా బడి నడిచినంతకాలం ఆయన హాజరవుతూనే ఉన్నారు. 2015, 2019 సంవత్సరాల్లో జిల్లా, మండల స్థాయిల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై సన్మానం అందుకున్నారు. మన ఊరు మన బడికి ఇది ఎంపిక కావటంతో సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రధానోపాధ్యాయుడి పనితీరు మెచ్చుకుంటూ ఇటీవల గ్రామస్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఇక్కడ చదివి వెళ్లిన విద్యార్థులు భానుప్రకాశ్‌ ట్రిపుల్‌ ఐటీలో, విజయలక్ష్మి, చందన ఇంటర్‌లో ఉత్తమంగా నిలిచారు. తన తండ్రి కష్టపడి చదివించి ఉపాధ్యాయుడిగా చేసినందుకు కృతజ్ఞతగా ప్రత్యేకత చాటడానికి విద్యార్థుల కోసం బడికి వస్తున్నానని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని