logo

పాము కాటుతో బాలుడి మృతి

పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్‌లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు.

Updated : 20 Apr 2024 05:56 IST

గుమ్మడిదల, న్యూస్‌టుడే: పాము కాటుతో బాలుడు మృతి చెందిన సంఘటన లక్ష్మాపూర్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. గుమ్మడిదల మండలం కొత్తపల్లి పంచాయతీ లక్ష్మాపూర్‌లో నివాసం ఉండే రవి, అనిత దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి ఇంటి ముందు వాకిట్లో పడుకున్నారు. నిద్రిస్తున్న సమయంలో కుమారుడు కిరణ్‌(14) ఒక్కసారిగా ఏడుస్తూ లేవడంతో తండ్రి రవి, కుటుంబసభ్యులు పాము కాటు వేసిందని గుర్తించారు. వెంటనే సమీపంలోని నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

మద్యం మత్తులో వెళ్లి.. శవమై కనిపించి

 పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి శవమయ్యాడు. ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపిన ప్రకారం పరిగి పట్టణం శాంతినగర్‌కు చెందిన బ్యాగరి జంగయ్య(48) కూలీగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. రానురాను మద్యానికి బానిస అయ్యాడు. ఈనెల 18వ తేదీన భార్య బంధువుల అంత్యక్రియలకు వేరే గ్రామానికి వెళ్లింది. జంగయ్య బయటికి వెళ్లి, రాత్రయినా ఇంటికి  రాలేదు. కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం పట్టణ శివారులోని పొలాల్లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలించారు. అనుమానంతో జంగయ్య భార్య లక్ష్మిని రప్పించారు. అక్కడ పడిఉన్న దుస్తులు, చెప్పులను చూసిన ఆమె తన భర్తేనని నిర్ధారణకు వచ్చింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

తాండూరు గ్రామీణ, వికారాబాద్‌: మహిళ హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధిస్తు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి కె.సుదర్శన్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎస్పీ కోటిరెడ్డి, తాండూరు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం 2013 ఫిబ్రవరి 20న తాండూరు మండలం కరణ్‌కోటకు చెందిన వడ్డెశ్యామలమ్మ ఇంట్లో ఉండగా, వరుసకు తమ్ముడైన లింగప్ప వచ్చాడు. ఈ సందర్భంగా 2011లో తన వద్ద తీసుకున్న తులంన్నర బంగారం, రూ.30వేలు ఇవ్వాలని అడిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి వాగ్వాదం జరగడంతో, లింగప్ప ఆగ్రహంతో ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలపాలైన శ్యామలమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై అప్పట్లో ఎస్సై శ్రీనివాస్‌ కేసు నమోదు చేయగా, సీఐ ఎన్‌.శ్రీనివాస్‌ విచారణ జరిపి నేర నివేదికను న్యాయస్థానంలో సమర్పించారు. పదకొండేళ్లుగా వాదోపవాదాలు జరిగాయి. శుక్రవారం మరోసారి కేసు విచారణకు రాగా న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. నిందితుడికి శిక్షపడేలా కేసు దర్యాప్తు చేసిన ఎస్సై, సీఐ, పీపీలు నారాయణ్‌గౌడ్‌, రవికుమార్‌ బృందాన్ని ఎస్పీ అభినందించారు.


పాత నేరస్థుడి అరెస్టు

హైదరాబాద్‌: అనుమానాస్పదంగా తిరుగుతున్న పాత నేరస్థుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, అతడి వద్ద మూడు ద్విచక్రవాహనాలు లభ్యమయ్యాయి. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టరు సైదిరెడ్డి తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన బి.శ్రీనివాస్‌ (45) కొంతకాలంగా పీఅండ్‌టీ కాలనీ కోదండరామనగర్‌లో ఉంటూ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి, రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్నాడు. అతడి నుంచి మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. అతడిపై సరూర్‌నగర్‌ ఠాణా పరిధిలో మూడు, జోగిపేట ఠాణా పరిధిలో రెండు కేసులు ఉన్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని