logo

ఎట్టకేలకు కేజీబీవీ నిర్మాణం ప్రారంభం

ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి.

Published : 05 May 2024 01:08 IST

వచ్చే విద్యాసంవత్సరం నాటికి అందుబాటులోకి

ప్లాస్టరింగ్‌ పూర్తయిన మొదటి   అంతస్తులోని తరగతి గదులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: ఎట్టకేలకు అక్కన్నపేట కేజీబీవీ భవన నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రెండున్నరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ భవన నిర్మాణ పనులు ఏడాది క్రితం వివిధ కారణాలతో అర్దంతరంగా ఆగిపోయాయి. ఎవరూ పట్టించుకోక పోవడంతో అప్పటి నుంచి పనులు చేపట్టలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవతో తిరిగి ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. అక్కన్నపేట మండల కేంద్రంలో నడుస్తున్న కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ.3.50 కోట్లు మంజూరు చేసింది. భవన నిర్మాణం కోసం స్థానిక పెట్రోల్‌బంక్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలం 5 ఎకరాలు కేటాయించారు. ఈ స్థలంలో భవన నిర్మాణ పనులకు 2021 సెప్టెంబర్‌ 17న మంత్రి హరీశ్‌రావు అప్పటి ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌తో కల్సి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాన్ని దక్కించుకున్న గుత్తేదారు మొదట్లో పనులను వేగంగా చేపట్టారు. మూడు అంతస్తుల వరకు స్లాబ్‌ పూర్తి చేశాడు. రెండు అంతస్తుల వరకు లోపల తరగతి గదుల గోడల నిర్మాణం పూర్తి చేశారు. మూడో అంతస్తుకు స్లాబ్‌ వేసిన తర్వాత బిల్లులు రావడం లేదనే కారణంతో వదిలేశారు. అప్పటి నుంచి పనులు నిలిచిపోయాయి. ఎవరూ పట్టించుకోక పోవడంతో సుమారు ఏడాది గడుస్తున్నా పనులు తిరిగి ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల అర్ధాంతరంగా ఆగిన ఈ పనుల గురించి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారుల ద్వారా తెల్సుకున్నారు. గుత్తేదారుతో మాట్లాడి బిల్లులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి పనులు పూర్తయ్యేలా, బవనం అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరారు. ఈ మేరకు గుత్తేదారు వారం రోజుల క్రితం పనులు తిరిగి ప్రారంభించారు. మొదటి రెండు ఫ్లోర్లలో ప్లాస్టరింగ్‌ పనులు చురుకుగా జరుగుతున్నాయి.

తీరనున్న అవస్థలు.. ప్రస్తుతం నడుస్తున్న పనుల తీరును చూస్తుంటే వచ్చే విద్యాసంవత్సరం నాటికి పాఠశాల భవనం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ అద్దె భవనంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. సుమారు 155 మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనంలో వారందరికీ సరిపడే సౌకర్యాలు లేవు. తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయి. డార్మిటరీ, భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేవు. అయినా ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని