logo

అవినీతి అధికారులకు మంత్రి అండ: సంకినేని

కొందరి అవినీతి అధికారులకు మంత్రి అండగా ఉండడం వల్లే జిల్లాలో అవినీతి పెరిగిపోతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 23 Jan 2022 05:41 IST

సూర్యాపేటలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు

సూర్యాపేట గ్రామీణం, న్యూస్‌టుడే: కొందరి అవినీతి అధికారులకు మంత్రి అండగా ఉండడం వల్లే జిల్లాలో అవినీతి పెరిగిపోతుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఆరోపించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోదాడలో ఏసీబీ వలలో చిక్కుకున్న కమిషనర్‌ను తీసుకొచ్చి సూర్యాపేటలో పెట్టారని.. ఆర్డీవోగా పని చేసిన వ్యక్తినే జాయింట్‌ కలెక్టర్‌గా మంత్రి తీసుకొచ్చారన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయకుండా అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను, అధికారులపై కేసు పెట్టకుండా అమాయకులపై కేసు పెట్టారని ఆరోపించారు. పీడీ కిరణ్‌కుమార్‌ 7 ఏళ్ల నుంచి ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. ఆత్మకూర్‌(ఎస్‌)లో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై రెవెన్యూ, సివిల్‌ సప్లయ్‌ అధికారులు విచారణ చేయకుండా పోలీసులు ఎలా కేసు నమోదు చేస్తారన్నారు. 12న కేసు నమోదు చేస్తే ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు పెట్టలేదన్నారు. మిల్లర్ల పేర్లు బయటికి రాకుండా అధికారులు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సూర్యాపేట పట్టణ సీఐ బియ్యం అమ్మిన డీలర్‌పై కేసు నమోదు చేయకుండా కొనుగోలు చేసిన సుధాకర్‌పై ఒప్పుకోకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించినట్లు ఆరోపించారు. కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న సీఐ, వీరేంద్ర, ఉపేందర్‌ ఇచ్చిన దరఖాస్తును ఎందుకు తీసుకోలేదన్నారు. సూర్యాపేట కమిషనర్‌కు వ్యవసాయ భూములు ఎలా వచ్చాయో ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని, కమిషనర్‌పై కేసు నమోదు చేయని సీఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి పల్సా మల్సూర్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు అబిద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని