logo

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జూన్‌ 1వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనాతో పరీక్షలు

Published : 20 May 2022 02:51 IST

‘న్యూస్‌టుడే’తో డీఈవో బి.భిక్షపతి

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి జూన్‌ 1వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. రెండేళ్లుగా కరోనాతో పరీక్షలు నిర్వహించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడం, దానిలో ప్రమేయం ఉన్న ఉపాధ్యాయులు, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలపై కేసుల నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దని డీఈవో బి.భిక్షపతి సీఎస్‌లను ఆదేశించారు. ఏపీలో జరిగిన సంఘటన నేపథ్యంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ముందు పశ్నాపత్రాలు తెరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించడం, సీసీ కెమెరాల వినియోగించడం వంటి కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ డీఈవోతో ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే.

* నల్గొండ జిల్లాలో 19,910 మంది రెగ్యులర్‌, 8 మంది ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్‌ వారిలో బాలురు 10,360, బాలికలు 9050 మంది, ప్రైవేట్‌ విద్యార్థుల్లో బాలురు 4, బాలికలు 4 మంది ఉన్నారు. మొత్తం 107 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం.

* అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారు. సీఎస్‌కు కేటాయించిన గదిలో సీసీ కెమెరా ఏర్పాటు తప్పనిసరి. పోలీసుస్టేషన్‌ నుంచి పరీక్ష కేంద్రానికి ప్రశ్నాపత్రం, కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ వచ్చాయి. వాటిని సీసీ కెమెరా ముందు తెరవాల్సి ఉంటుంది. సీసీ కెమెరా ఆన్‌ చేశాక పరీక్ష ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆన్‌లోనే ఉండాలి. ప్రశ్నాపత్రాలు తెరిచిన సమయాన్ని సీఎస్‌లు రికార్డు చేయాలి. ప్రస్తుతానికి 16 కేంద్రాల్లోనే సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. 31 ప్రైవేట్‌ పరీక్ష కేంద్రాల్లో ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యం కింద ఉన్న 60 కేంద్రాల్లో సీసీ కెమెరాలు కొత్తగా ఏర్పాటు చేస్తాం. పరీక్షలు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లు సహ ఎవరికి కూడా సెల్‌ఫోన్లకు అనుమతి లేదు.

* పరీక్ష కేంద్రాల చుట్టు పక్కన ఉన్న జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రయివేట్‌ పరీక్ష కేంద్రాల్లో జిరాక్స్‌ యంత్రాలు ఉంటాయి. వాటిని పరీక్షలు ముగిసే వరకు అక్కడి నుంచి వేరే చోటుకి తరలించేలా చూస్తాం.

* పరీక్ష కేంద్రంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నాం. తగిన ఫర్నిచర్‌ ఏర్పాటు చేస్తున్నాం. కరెంట్‌, ఫ్యాన్‌ ఉన్న తరగతి గదుల్లో పిల్లలు పరీక్ష రాస్తారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని మంచి నీటి సౌకర్యం, వైద్యారోగ్య సిబ్బంది సేవలు అందుబాటులో ఉంటాయి. పోలీసు బందోబస్త్‌ నిర్వహిస్తారు.

* అన్ని మండలాల్లో సంబంధిత ఎంఈవోల చరవాణి నెంబర్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌గా ఉంటుంది. జిల్లా స్థాయిలో డీఈవో నెంబర్‌ 98499 09123కు సమాచారం ఇవ్వొచ్ఛు పరీక్షల సహాయక కమిషనర్‌ చరవాణి 79898 19053 హెల్ప్‌లైన్‌గా ఉంటాయి. ● 107 కేంద్రాలలో 107 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 107 డిపార్టుమెంటల్‌ అధికారులు, 1110 మంది ఇన్విజిలెటర్లు, ఆరుగురు ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌ పరీక్షల విధుల్లో పాలుపంచుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని