logo

రోడ్లు బాగైతే అభివృద్ధి చేసినట్లేనా?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్గొండ జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

Published : 24 May 2022 03:51 IST

నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: కోమటిరెడ్డి


నల్గొండలోని మర్రిగూడ బైపాస్‌ చౌరస్తా వద్ద ఊరేగింపులో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ జిల్లాపరిషత్‌, న్యూస్‌టుడే: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్గొండ జిల్లాకేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి జిల్లా నుంచి తరలి వచ్చిన పార్టీ శ్రేణుల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ ప్రజలు తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారన్నారు. తనకు గుండెకాయ లాంటి నల్గొండ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. భువనగిరి ఎంపీగా ఉన్నప్పటికీ నీలగిరి ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. గత ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేసీఆర్‌ చెప్పడంతో ప్రజలు తనను ఓడించారని అన్నారు. కానీ సీఎం హామీ విస్మరించి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలో ఒక రోడ్డు బాగు చేసినంత మాత్రాన నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి అయినట్టేనా అని ప్రశ్నించారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. చేతకాని మంత్రి జగదీశ్‌రెడ్డి వల్ల అభివృద్ధి కుంటుబడిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. వరి సాగు చేయకుండా కేసీఆర్‌ రైతులను అడ్డుకున్నారని విమర్శించారు. అంతకుముందు నల్గొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ఆలేరు, సూర్యాపేట నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు బీర్ల అయిలయ్య, పటేల్‌ రమేష్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, నల్గొండ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకుల లక్ష్ముయ్య, పరమేష్‌, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని