logo

ఉప పోరుకు సై

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ వెంటనే స్పీకర్‌ ఆమోదించి, ఈ స్థానం ఖాళీ అయిందని నోటిఫికేషన్‌ వెలువడటంతో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లూ

Published : 09 Aug 2022 06:29 IST

రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అమోదంతో అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలోకి

ఈనాడు, నల్గొండ:

రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ వెంటనే స్పీకర్‌ ఆమోదించి, ఈ స్థానం ఖాళీ అయిందని నోటిఫికేషన్‌ వెలువడటంతో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌, భాజపాలు ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లూ రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై కొంత సందిగ్ధం నెలకొనడంతో అన్ని పార్టీలు ఎన్నికలు వస్తాయా? రావా? అన్న మీమాసంలో ఉండగా...తాజా నిర్ణయంతో ఇక పోరు క్షేత్రస్థాయికి చేరింది. అన్ని పార్టీలకు ఈ ఎన్నిక చావో రేవో కావడంతో ఎక్కడా ఎదుటి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే మండలాలు, కులాల వారీగా ఆశావహులు లెక్కలు తీస్తున్నారు. కాంగ్రెస్‌, తెరాసలో పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. అనూహ్య పరిణామాలు ఎదురైతే తప్ప ఇప్పటికీ భాజపా నుంచి రాజగోపాల్‌రెడ్డియే పోటీ చేస్తారని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.

కార్యక్షేత్రంలో కాంగ్రెస్‌

సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే మండలాల వారీగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. పార్టీ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సంస్థాన్‌నారాయణపూర్‌ మండలానికి చెందిన చల్లమల్ల కృష్ణారెడ్డి నాంపల్లి మండలంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. చండూరులో ఇటీవల నిర్వహించిన సభ విజయవంతం కావడంతో క్యాడర్‌లో ఉత్సాహం పెరగగా...వచ్చే వారం పది రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండలాల వారీగా పర్యటించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నేటి నుంచి ఆగస్టు 15 వరకు ఏఐసీసీ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలో 75 కి.మీ. పాదయాత్ర చేయాలని పార్టీ నేతలు నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో నారాయణపూర్‌ మండలం నుంచి చౌటుప్పల్‌ వరకు కార్యకర్తలతో పాదయాత్ర చేయాలని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. మరోవైపు ప్రతి మండలంలోని పది మంది ముఖ్య కార్యకర్తలను ఎంపిక చేసి నియోజకవర్గ పరిస్థితిపై ఎప్పటికప్పుడు పీసీసీ పర్యవేక్షిస్తోంది. అందులో భాగంగా వచ్చే వారం రోజుల్లో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు, నాయకులతో రేవంత్‌రెడ్డి స్వయంగా సమీక్షా సమావేశం పెట్టనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

నియోజకవర్గంలో భాజపా పాదయాత్ర

రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఆమోదం పొందిన రోజే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర మునుగోడు నియోజకవర్గానికి చేరుకుంది. నియోజకవర్గంలో కీలమైన చౌటుప్పల్‌ పురపాలికతో పాటు గ్రామీణ మండలంలో మంగళవారం పాదయాత్ర జరగ్గా చాలా చోట్ల ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు భాజపాలోకి చేరారు. మంగళవారం నుంచి రాజగోపాల్‌రెడ్డి సైతం క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను ముమ్మరం చేయనున్నారు. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు, నియోజకవర్గంలో తన వెంటే వచ్చే వారెవరు అనే కోణంలో పర్యటన సాగనుందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పాదయాత్ర నిర్వహించాలనే దానిపైనా చర్చలు సాగుతున్నటు,్ల త్వరలోనే వాటిపై స్పష్టత వస్తుందని పార్టీ ముఖ్య నేత ఒకరు ‘ఈనాడు’కు వెల్లడించారు.

పరిణామాలను గమనిస్తున్న అధికార పార్టీ

ఒక పక్క కాంగ్రెస్‌, భాజపా ఎన్నికల పోరుకు శంఖం పూరించగా నియోజకవర్గంలోని తాజా పరిణామాలను అధికార తెరాస జాగ్రత్తగా గమనిస్తోంది. గట్టుప్పల మండలం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతా సభ పేరుతో ఎన్నికల పోరును ప్రారంభించినా ఇంకా క్షేత్రస్థాయిలో ఎలాంటి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రారంభించలేదు. ఏడు మండలాల్లో తమకు సంస్థాగత బలం ఉందని... గత ఎన్నికల సమయంలో చేజారిన ఈ నియోజకవర్గాన్ని ఇప్పుడు కైవసం చేసుకోవాలని తెరాస భావిస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.

Read latest Nalgonda News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని