logo

నియోజకవర్గ అభివృద్ధికే రాజీనామా

తెరాస ఎమ్మెల్యేను కాదన్న ఒకే కారణంతో మునుగోడు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేయడం లేదని, నియోజకవర్గ అభివృద్ధికే తాను రాజీనామా చేయవలసి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలకు స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ

Published : 12 Aug 2022 06:08 IST

కాంగ్రెస్‌ కార్యకర్తలంతా కలిసి రావాలి : రాజగోపాల్‌రెడ్డి పిలుపు

ఈనాడు, నల్గొండ - న్యూస్‌టుడే, నాంపల్లి: తెరాస ఎమ్మెల్యేను కాదన్న ఒకే కారణంతో మునుగోడు నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ అభివృద్ధి చేయడం లేదని, నియోజకవర్గ అభివృద్ధికే తాను రాజీనామా చేయవలసి వచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలకు స్పష్టం చేశారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించేందుకు అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అవినీతి, అక్రమాలను వెలికితీయడం భాజపాతోనే సాధ్యమని, అందుకే తాను ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం తిర్మలగిరిలో గురువారం తన అనుచరులు, కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ సర్పంచులు, ఇతర ముఖ్యనాయకులు హాజరయ్యారు. తన రాజీనామా వల్ల ఉప ఎన్నిక అనివార్యం కావడంతో రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేస్తున్నారని, 57 ఏళ్లకు పెన్షన్‌ లాంటి పథకాలు ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. తన వెంట వచ్చే కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నారనే ప్రచారం బయట, సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా జరుగుతోందని కొంత మంది కార్యకర్తలు సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకురాగా... తెరాస కావాలనే ఈ దుష్పచారం చేస్తుందని, దీన్ని ఎవరూ నమ్మవద్దని కోరినట్లు తెలిసింది. ఈ నెల మునుగోడులో జరిగే అమిత్‌షా బహిరంగ సభలో తాను భాజపాలో చేరుతున్నానని, సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో ముఖ్య నాయకులను కోరినట్లు సమాచారం. మరోవైపు వచ్చే మూడు రోజుల పాటు (శుక్ర, శని, ఆదివారం) మిగితా మండలాల్లోనూ పర్యటించి తాను రాజీనామా చేయడానికి కారణాలతో పాటూ కార్యకర్తలు తనతో రావాలని విజ్ఞప్తి చేయడానికి సమవేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని