logo

ఆలేరు అవిశ్వాస తీర్మానం కథ కంచికి..

ఆలేరు పురపాలక సంఘం ఛైర్మన్‌పై తలపెట్టిన అవిశ్వాసం నోటీసు కథలో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని మెజారిటీ కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు.

Published : 01 Feb 2023 05:33 IST

ప్రతిపాదించి.. విరమించుకున్న కౌన్సిలర్లు

యాదాద్రి కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో మంగళవారం అవిశ్వాస నోటీసు చూపుతున్న ఆలేరు కౌన్సిలర్లు

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు పురపాలక సంఘం ఛైర్మన్‌పై తలపెట్టిన అవిశ్వాసం నోటీసు కథలో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి అవిశ్వాస తీర్మానం పెట్టకూడదని మెజారిటీ కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆలేరు పురపాలిక ఛైర్మన్‌ వస్పరి శంకరయ్యపై 12 మంది కౌన్సిలర్లకు 10 మంది అవిశ్వాస నోటీసు ఇచ్చేందుకు మంగళవారం యాదాద్రి కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడం.. ఇంతలోనే విషయం బయటకు పొక్కడంతో డీసీసీబీ ఛైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి రంగంలోకి దిగారు. అధికార భారాసకు చెందిన ఏడుగురు కౌన్సిలర్లతో ఆయన చరవాణిలో మాట్లాడారు. అవిశ్వాసం నోటీసును కలెక్టర్‌కు అందజేయవద్దని.. ఏమైనా సమస్యలు ఉంటే తాను పరిష్కరిస్తానని చెప్పారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఆరుగురు, స్వతంత్ర కౌన్సిలర్‌ ఒకరు  అవిశ్వాస నోటీసు విషయమై ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. దీంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు కంగుతిన్నారు. అప్పటికే పది మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన నోటీసు పత్రాన్ని పుర వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎం.మాధవి, కాంగ్రెస్‌, భాజపాకు చెందిన సంగు భూపతి, చింతలఫణి సునీత, స్వతంత్ర కౌన్సిలర్‌ గుత్తా శమంత కలెక్టర్‌ పమేలా సత్పతికి అందజేశారు. అప్పటికే కలెక్టరేట్‌కు చేరిన భారాస ముఖ్య నాయకులు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లను యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే గొంగిడి సునీత నివాసానికి తరలించారు. గంటల తరబడి చర్చల అనంతరం తాము ఛైర్మన్‌ శంకరయ్యపై పెట్టిన అవిశ్వాస నోటీసు తొందరపాటుగా తీసుకున్న నిర్ణయమని, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని, పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే నడుచుకుంటామని భారాసకు చెందిన వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఎం.మాధవి, కౌన్సిలర్లు బి.రాములు, ఎ.దయామణి, కె.శ్రీకాంత్‌, ఎం.సునీత, డి.నాగమణి, స్వతంత్ర కౌన్సిలర్‌ జె.శ్రీకాంత్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని