logo

రౌడీషీటర్లపై ఉక్కుపాదం

జిల్లా పోలీసు వర్గాల్లో ‘ఈనాడు’ కథనం తీవ్ర కలకలం సృష్టించింది. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈనాడులో శనివారం ‘మళ్లీ రౌడీలొచ్చేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

Published : 05 Feb 2023 06:13 IST

‘ఈనాడు’ కథనంపై ఎస్పీ ఆరా

ఈనాడు, నల్గొండ :  జిల్లా పోలీసు వర్గాల్లో ‘ఈనాడు’ కథనం తీవ్ర కలకలం సృష్టించింది. రౌడీషీటర్లు, పాత నేరస్థుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో ఈనాడులో శనివారం ‘మళ్లీ రౌడీలొచ్చేశారు’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ కథనంపై ఆరా తీసిన ఎస్పీ అపూర్వ రావు నల్గొండ, మిర్యాలగూడలోని పాత రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ఆదేశించారు. దీంతో మిర్యాలగూడలో ఓ రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒకట్రెండు రోజుల్లో మరో ఇద్దరి ముగ్గురిపైనా తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. నల్గొండ నియోజకవర్గంలోని ఓ ఎస్‌హెచ్‌వోపైనా నేడో రేపో చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు రానున్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. గంజాయిపైనా పకడ్బందీ నిఘా పెట్టాలని, అసెంబ్లీ సమావేశాల అనంతరం జిల్లా స్థాయిలో గంజాయిపై నేర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎస్పీ భావిస్తున్నట్లు సమాచారం.


మిర్యాలగూడలో అరెస్టు

మిర్యాలగూడ, న్యూస్‌టుడే: మిర్యాలగూడ పట్టణంలోని ఇస్లాంపురం వాసి, రౌడీషీటర్‌ జునేయిద్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు రెండో పట్టణ సీఐ ఎన్‌.సురేష్‌ విలేకరులకు తెలిపారు. గతనెల 23న సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగిన వివాహానికి జునేయిద్‌ అనుచరులతో కలిసి వెళ్లాడు. అక్కడ వినయ్‌ అనే యువకుడితో వివాదం జరిగి ఫంక్షన్‌హాల్‌లోనే ఘర్షణకు దిగాడు. వినయ్‌ నేరేడుచర్ల పోలీసు స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జునేయిద్‌ గత నెల 24న వినయ్‌కు ఫోన్‌చేసి కేసు విరమించుకోవాలని బెదిరించాడు. దీంతో పాటుగా ఆయన అనుచరులు 20 మంది బుల్లెట్‌లు, ఇతర ద్విచక్రవాహనాలపై మిర్యాలగూడ శాంతినగర్‌లో నివాసం ఉండే వినయ్‌ ఇంటిపైకి దాడికి వెళ్లారు. బుల్లెట్‌ బైక్‌లు భారీ శబ్దం చేసుకుంటూ వినయ్‌ ఇంటిచుట్టూ తిప్పుతూ భయానక వాతావరణం సృష్టించారు. వినయ్‌ రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు బుల్లెట్‌ వాహనాలు స్వాధీనం చేసుకోగా యువకులు పరారయ్యారు. ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని నిందితుడు జునేయిద్‌ కోసం గాలిస్తున్నారు. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని