logo

కాడి భారమై.. పాడెకు చేరువై..!

దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన బానోత్‌ సురేష్‌ (30) తనకున్న రెండెకరాలతో పాటూ మరో రెండెకరాలను కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు.  వర్షాలు పడి పంట నష్టం కావడంతో రూ.3 లక్షలు అప్పు చేసి పెట్టిన పెట్టుబడీ రాని పరిస్థితి నెలకొంది.

Published : 05 Feb 2023 06:21 IST

తొమ్మిదేళ్లలో నల్గొండ జిల్లాలో 1686 మంది రైతుల ఆత్మహత్యలు
ఈనాడు, నల్గొండ

దేవరకొండ మండలం మైనంపల్లికి చెందిన బానోత్‌ సురేష్‌ (30) తనకున్న రెండెకరాలతో పాటూ మరో రెండెకరాలను కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశాడు.  వర్షాలు పడి పంట నష్టం కావడంతో రూ.3 లక్షలు అప్పు చేసి పెట్టిన పెట్టుబడీ రాని పరిస్థితి నెలకొంది. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక 2015 అక్టోబరు 20న ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే సురేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఛార్జ్‌షీట్‌ నమోదు చేసినా.. ఇప్పటికీ ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.


వలిగొండ మండలం ఎదుళ్లగూడేనికి చెందిన చీర్క నర్సిరెడ్డి (36) పత్తి పంట సాగు చేయగా..వరుసగా రెండేళ్లు తీవ్ర నష్టం వచ్చింది. చేసిన అప్పులు రూ.2 లక్షలు కావడంతో దిక్కుతోచక 2018 అగస్టు 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదైంది. ఇప్పటికీ ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం దక్కలేదు.


ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడి వ్యయం..అదే నిష్పత్తిలో దిగుబడులు, పంటల ధరలు పెరగకపోవడం..వ్యవసాయ వృద్ధి పెరుగుతున్నా..ఆర్థిక స్థితిగతుల్లో మార్పు రాకపోవడం..అన్నదాతల ఆర్థికవృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెడుతున్నా.. ఆత్మహత్యలు మాత్రం నల్గొండ జిల్లాలో ఆగడం లేదు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 2014 నుంచి 2022 వరకు తొమ్మిదేళ్లలో 1686 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడైంది. అంటే సగటున ఏడాదికి 187 మంది రైతులు అప్పుల బాధతో పాడెక్కుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో జరిగిన రైతుల ఆత్మహత్యలు వీటికి అదనం.  రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల నివేదిక అట్లాస్‌ సైతం వెల్లడించడం గమనార్హం. అయితే ఇందులో చాలామంది కౌలు రైతులే ఉన్నారు. కౌలు రైతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా ఎలాంటి సాయం లేకపోవడం, ప్రభుత్వ పథకాల్లోనూ వీరికి భాగస్వామ్యం కల్పించకపోవడంతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  వారి కుటుంబాలకు ఎలాంటి సాయం అందడం లేదు.  

పత్తి దిగుబడులు తగ్గడంతోనే...

ప్రధానంగా పత్తి సాగులో నష్టాలతోనే రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. తాజాగా నల్గొండ జిల్లాలో చాలా మంది రైతుల ఇళ్లల్లో ఇంకా పత్తి నిల్వలు ఉన్నాయి. ధరలు లేకపోవడంతో పాటూ ఈ ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో దళారులు అంతా సిండికేట్గా ఏర్పడి రైతుకు మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు కొనుగోళ్లు చేస్తున్నారు. ఈ వానాకాలంలోనూ మూడు జిల్లాల్లో కలిపి దాదాపు 9 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా..గులాబీ తెగులుతో పాటూ అకాల వర్షాలూ దిగుబడిని దెబ్బతీశాయి. గతేడాదితో పోలిస్తే సగానికి సగం దిగుబడులు తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు రైతుల మీద పడ్డాయి. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పరిహారమూ దక్కడం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమైన ఫసల్‌బీమా యోజనను సైతం నిలిపేయడంతో రైతుకు ఎలాంటి సాయం అందడం లేదు. అన్నదాతకు సకాలంలో పంట రుణాలిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాల్సిన బ్యాంకులు మూడు జిల్లాల్లోనూ రుణాలివ్వడానికీ అనేక కొర్రీలు పెడుతున్నాయి. రుణమాఫీ పథకం అమలులో జాప్యం సైతం ఇందుకు కొంత కారణమవుతోంది.  


పరిహారం కోసం కోర్టుకు

ఆత్మహత్య చేసుకున్న సమయంలో పోలీసుల విచారణలో రైతు ఆత్మహత్యగా ఛార్జ్‌షీట్‌ నమోదు చేసినా పరిహారం అందడం లేదని నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోని 33 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలు హైకోర్టుకు వెళ్లాయి. వీరి తరఫున రైతు స్వరాజ్య వేదిక (స్వచ్ఛంద సంస్థ) ప్రతినిధులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నాలుగైదు రోజుల్లో దీనికి సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించనుందని తెలిసింది.


ప్రభుత్వాలే బాధ్యత వహించాలి
- ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, నల్గొండ

గిట్టుబాటు ధరతో పాటూ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించినప్పుడే రైతులు పండించిన పంటలకు ఆదాయం వస్తుంది. రుణమాఫీలో జాప్యంతోనూ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. బలవన్మరణాలకు పాల్పడిన కుటుంబాలకు మెరుగైన పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.


కౌలు రైతులకూ న్యాయం జరిగేలా పోరాటం
- కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక, రాష్ట్ర కన్వీనర్‌

నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందడం లేదు. అందుకే రైతు స్వరాజ్య వేదిక తరఫున కోర్టుకు వెళ్లాం. కౌలు రైతుల కుటుంబాలకూ ప్రభుత్వం ఆర్థికంగా న్యాయం చేస్తేనే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని