logo

కనుచూపు మేర.. కాజేస్తూ..!

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అటవీ, ప్రభుత్వ ఎన్‌ఎస్‌పీ భూములు అధికంగా ఉండటంతో ఆక్రమణదారులు వాలిపోతున్నారు.

Published : 09 Feb 2023 03:22 IST

నేరెడుగొమ్ము (చందంపేట), న్యూస్‌టుడే

వైజాగ్‌కాలనీ సమీపంలో ఉన్న ఎన్‌ఎస్‌పి భూములలో వెలసిన అక్రమ వెంచర్‌

కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అటవీ, ప్రభుత్వ ఎన్‌ఎస్‌పీ భూములు అధికంగా ఉండటంతో ఆక్రమణదారులు వాలిపోతున్నారు. స్థానికులతో కలిసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు సరికొత్త ఎత్తుగడలతో దందాను కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఓపెన్‌ ఎయిర్‌  జైల్‌ నిర్మాణం, ఏకో టూరిజం నిర్మాణ పనులతో పాటు అంబ భవాని ఎత్తిపోతల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడి భూముల విలువలు భారీగా పెరిగాయి. నేరెడుగొమ్ము మండల పరిధిలో సగానికిపైగా గ్రామాలు కృష్ణా పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డాయి. ఇక్కడివాసులు దాదాపు వందలకుపైగా ఎకరాల్లో కృష్ణానది ఖాళీ ప్రాంతాలలో పంటలను సాగుచేసుకొని ఎన్‌ఎస్‌పీ భూములను అనధికారికంగా ఇతరులకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు కాచరాజుపల్లి, వైజాగ్‌కాలనీ, కొత్తపల్లి, చిన్నమునిగల్‌లో కొనసాగుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

వైజాగ్‌కాలనీలో అక్రమ వెంచర్లు

విశాఖపట్టణం నుంచి కొన్ని కుటుంబాలు ఈ ప్రాంతానికి వలసవచ్చాయి. క్రమేణా 300 కుటుంబాలకు పైగా వైజాగ్‌కాలనీ ఎన్‌ఎస్‌పీ భూముల్లో ఇళ్ల నిర్మాణాం చేసుకొని స్థిరపడ్డారు. స్థానికులతో కలిసి సమీపంలో ఉన్న సర్వే నెంబరు 134, 139, 140లో ఎకరం ఖాళీ ఎన్‌ఎస్‌పీ భూమిని తూర్పుతండాకు చెందిన ఓ రైతు నుంచి రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ భూమి సమీపంలో ఉన్న గుట్టలను తొలగించి మరో ఎకరం భూమిని చదునుచేసి 2 ఎకరాలలో అక్రమ వెంచర్లను ఏర్పాటు చేశారు. దీంతో వైజాగ్‌కాలనికి చెందిన పలువురు ఆ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీనిద్వారా రూ.కోటి 30లక్షల లాభాలు పొందినట్లు పలువురు పేర్కొంటున్నారు. కాచరాజుపల్లి గ్రామ సమీపంలోని సుద్దబావితండలో సర్వే నెంబరు 29లో ముంపు భూమిలో ఇదే తంతు కొనసాగడంతో పాటు పలు గృహాలు యథేచ్ఛగా నిర్మాణం చేపట్టారు. ఎన్‌ఎస్‌పీ భూములు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి పట్టాలు లేకుండా కేవలం 100ల బాండు మీద రాతపూర్వకంగా రాసి ఒక్కొక్క ప్లాటుకు రూ.4-6లక్షల వరకు విక్రయిస్తున్నారు.


హద్దురాళ్లను తొలగించాం

అరుణ, తహసీల్దార్‌, నేరెడుగొమ్ము

వైజాగ్‌కాలనీ గ్రామ సమీపంలో సర్వే నెం.134,.139,140లో ఉన్న ఎన్‌ఎస్‌పీ భూములలో అక్రమ వెంచర్లు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయి. గ్రామాన్ని సందర్శించి అక్రమంగా చేసిన వెంచర్లలో రాళ్లను తొలగించాం. ఆ భూములలో ఇళ్ల నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని