logo

కబ్జా కోరల్లో.. కాల్వ కట్టలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు సంబంధించిన స్థలాల కబ్జా యథేచ్ఛగా సాగుతున్నా.. ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 09 Feb 2023 03:22 IST

నేరేడుచర్ల: ఫత్తేపురం ఆర్‌-8 లిఫ్టు సమీపంలో సాగర్‌ ఎడమకాల్వ 

కట్ట స్థలంలో ఆక్రమణల పర్వం ఇలా

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు సంబంధించిన స్థలాల కబ్జా యథేచ్ఛగా సాగుతున్నా.. ఆ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఫత్తేపురం ఆర్‌-8 ఎత్తిపోతల పథకం పక్కన ఎడమ కాల్వ కట్ట స్థలాన్ని చదును చేసి, మడులుగా మార్చి సాగర్‌ ఎడమ కాల్వకు పైప్‌లైన్లు వేసి సాగుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం సాగర్‌ ప్రధాన కాల్వతో పాటు మేజర్లకు బౌండరీలు గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని గతేడాది నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. దీనికి సంబంధించి కొన్నిచోట్ల మార్కింగ్‌ సైతం ఇచ్చారు. ఒకరిని చూసి ఒకరు కాస్త వెడల్పుగా ఉన్న చోట ఆక్రమణలు జరిపి వరి సాగు చేపడుతున్నారు. ఎడమ కాల్వకు ఇరువైపులా కట్టలతో పాటు కొన్ని చోట్ల విశాలంగా స్థలాలు వదిలారు. ఆ స్థలాలను వినియోగించేవారు చాలా చోట్ల ఆక్రమించడంతో కట్టల పరిధి సైతం తగ్గిపోతోంది. కాల్వ కట్టల వెంట నిల్వ ఉంచిన ఎత్తయిన మట్టి గుట్టలు కాస్తా కనుమరుగై పోతుండటంతో భవిష్యత్తులో కాల్వ కట్టలకు గండ్ల ముప్పు పెరగనుంది.

ప్లాంట్‌ స్థలాలు ఆక్రమించేశారు..

ఇదే పంచాయతీ పరిధిలో సాగర్‌ కాల్వల నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ స్థలాలు సైతం ఇప్పటికే ఆక్రమణల పాలయ్యాయి. మేడారం శివారులోనూ కాల్వ కట్టల ఆక్రమణ ఎక్కువగా ఉంది. జాన్‌పహాడ్‌ మేజర్‌ పరిధిలోని ఆర్‌-3 కాల్వను నేరేడుచర్ల పట్టణంలో ఓ వైపు కట్ట రెండు, మూడు కిలోమీటర్ల మేర పూర్తిగా ఆక్రమించేశారు. దీనికి తోడు పట్టణవాసులు కాల్వలో వ్యర్థాలు పోస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాలలో కాల్వకట్టల ఆక్రమణలపై పలుసార్లు స్థానికులు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు.  


ఆ స్థలం గ్రామపంచాయతీకి అప్పగించారు..

శ్రుతి, సాగర్‌ ఎడమకాల్వ ఏఈ

ఆక్రమణలకు గురవుతున్న స్థలాన్ని రెవెన్యూశాఖ హరితహారం, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం ఏడెకరాల వరకు గ్రామపంచాయతీకి అప్పగించింది. ఈ ఆక్రమణలను వారే నిలువరించాల్సి ఉంటుంది.


ఆక్రమణలను నిలువరిస్తాం..

రఘు, సాగర్‌ ఎడమకాల్వ డీఈ

సాగర్‌ ఎడమ కాల్వ స్థలాలను ఆక్రమిస్తున్న విషయం వాస్తవమే. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తే తప్ప వీటిని ఆపలేని పరిస్థితి. చాలా చోట్ల ఇప్పటికే కాల్వ స్థలాల ఆక్రమణలు జరిగాయి. ఫత్తేపురం వద్ద జరుగుతున్న ఆక్రమణలను నిలువరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని