logo

అమ్మ ఆశయం.. అల్లుకుంది

భర్తతో పాటు బతుకుదెరువు కోసం సూరత్‌కు వెళ్లి మూడు నెలలపాటు అక్కడ నేర్చుకున్న కుట్టు శిక్షణ నేడు అనేక మంది మహిళలకు ఆసరాగా నిలుస్తోంది.

Updated : 22 Mar 2023 05:35 IST

రెండున్నర దశాబ్దాలుగా ఉచిత కుట్టుశిక్షణ ఇస్తున్న పద్మ

 

మహిళలకు డ్రెస్‌ కటింగ్‌లో శిక్షణ ఇస్తున్న పద్మ

మోతె, న్యూస్‌టుడే: భర్తతో పాటు బతుకుదెరువు కోసం సూరత్‌కు వెళ్లి మూడు నెలలపాటు అక్కడ నేర్చుకున్న కుట్టు శిక్షణ నేడు అనేక మంది మహిళలకు ఆసరాగా నిలుస్తోంది. మోతె మండలానికి చెందిన పద్మ సుమారు 25 ఏళ్లుగా వందల మంది మహిళలకు ఉచితంగా కుట్టుశిక్షణ నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబాల్లోని మహిళలు జీవనోపాధిలేక పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిన తన తల్లి లక్ష్మమ్మ ఆశయం మేరకు గ్రామీణ మహిళలకు తనకు తెలిసిన కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ పనుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.

ఇంట్లోనే శిక్షణ కేంద్రం..

సూరత్‌లో తాను తీసుకున్న శిక్షణను ఇక్కడి యువతులు, మహిళలకు పద్మ నిత్యం తన ఇంట్లోనే కేంద్రం ఏర్పాటు చేసి నేర్పిస్తున్నారు. ఇందుకు అవసరమైన మిషన్లను, శిక్షణ సామగ్రిని డ్రెస్‌లు కుట్టి వచ్చిన సంపాదనతోనే ఏర్పాటు చేసుకున్నారు. తొలినాళ్లలో ఎంపీడీవో కార్యాలయం ఆధ్వర్యంలో గ్రామాల్లో మహిళలకు శిక్షణ ఇస్తే గౌరవ వేతనం కింద నెలకు రూ.550 ఇచ్చేవారు. తర్వాత ప్రతిఫలం ఆశించకుండా మండలకేంద్రంలో తనకున్న చిన్న ఇంట్లో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి నేర్పించడం మొదలు పెట్టారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ఇప్పటికీ రోజుకు 20 మంది వరకు శిక్షణ ఇస్తున్నారు. డ్రెస్‌లతో పాటు ఎంబ్రాయిడరీలో ఆసక్తి ఉన్న వారికి అందులోనూ శిక్షణ ఇస్తున్నారు. రెండున్నర దశాబ్దాలుగా వందల మందికి శిక్షణ ఇచ్చినట్లు చెబుతున్నారు. తన వద్ద శిక్షణ తీసుకున్న యువతులు వారి ప్రాంతాల్లో టైలరింగ్‌ షాపులు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నట్లు వివరించారు.
* దీనిని ఇలాగే కొనసాగిస్తానని పూసోజు పద్మ తెలిపారు. శిక్షణ తర్వాత స్వయంగా కుట్టుమిషన్‌ ఏర్పాటు చేసుకోలేని మహిళలకు ప్రభుత్వం చేయూత అందిస్తే వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని