logo

ఇంతింతయ్యేందుకు

మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలోని ఎస్‌బీఐ ఆర్‌సెట్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తోంది.

Updated : 22 Mar 2023 06:39 IST

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే

నల్గొండలోని ఎస్‌బీఐ ఆర్‌సెట్‌ కుట్టు శిక్షణలో కాగితాల ద్వారా దుస్తులు కత్తిరించే విధానం నేర్పుతున్న శిక్షకులు
మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నారు. నల్గొండలోని ఎస్‌బీఐ ఆర్‌సెట్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలను ఎంపిక చేసి కుట్టు శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందిస్తున్నారు. దీంతోపాటు బ్యాంకుల నుంచి అవసరం మేర రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించుకునేలా అండగా నిలుస్తున్నారు. నల్గొండలోని టీటీడీసీ భవనంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు 30 మందికి శిక్షణ అందిస్తున్నారు. ఈ నెల రోజులు ఉచితంగా వసతితో పాటు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అనుభవజ్ఞులైన వారితో శిక్షణ ఇప్పించి కుట్టుతోపాటు అల్లికలు, ఎంబ్రాయిడరీ నేర్పుతున్నారు. గతంలో ఇందులో నేర్చుకున్న వారు కొందరు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందగా, మరి కొందరు హైదరాబాద్‌ వంటి పెద్ద పెద్ద పట్టణాల్లో దుస్తుల తయారీ కేంద్రాలో పని చేస్తూ ఉపాధి పొందుతున్నారు. తద్వారా కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు.


ఆర్థిక భరోసా కలుగుతుంది

-లక్ష్మి, పెన్‌పహాడ్‌, సూర్యాపేట జిల్లా

ఇంటర్‌ వరకు చదివాను. ఉచిత శిక్షణతో స్వయం ఉపాధి పొందడంతో పాటు ఆర్థిక భరోసా కలుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. కేంద్రంలో ఉచిత భోజన వసతి కల్పించారు. ఇక్కడే ఉండటం వల్ల కుట్టు నేర్చుకోవడం సులభమవుతుంది. పట్టణాల్లో వేలాది రూపాయలు వెచ్చించినా ఇలాంటి శిక్షణ, భోజన సదుపాయం లభించదు. మహిళలు అందరు కలసి శిక్షణ పొందడంతో పాఠశాల రోజులు గుర్తుకు వస్తున్నాయి.


వ్యవసాయ పనికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది
-యశోద ఎస్‌.లింగోటం, కనగల్‌ మండలం

నిత్యం వ్యవసాయానికి వెళ్లటం ఇబ్బందిగా ఉంది. మా కుటుంబ సభ్యుల సహకారంతో కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నా. ఇక్కడ చాలా మోడల్స్‌ నేర్పిస్తున్నారు. ఉచిత కుట్టు శిక్షణ ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవడానికి దోహద పడుతుంది.


మహిళలు సద్వినియోగం చేసుకోవాలి
- పూజ, తుర్కపల్లి, యాదాద్రి జిల్లా

ఎస్‌బీఐ ఆర్‌సెట్‌ నిర్వహించే కుట్టును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మహిళలు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే కుట్టు, అల్లికల కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి పొందుతా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని