logo

చౌటుప్పల్‌లో అన్నపూర్ణ క్యాంటీన్‌

పేదలకు చౌక ధరకు భోజనం పెట్టేందుకు చౌటుప్పల్‌ పట్టణంలో రూ.30 లక్షలతో అన్నపూర్ణ క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని పురపాలిక పాలకవర్గ సమావేశంలో తీర్మానించారు.

Published : 31 May 2023 05:06 IST

చౌటుప్పల్‌ పురపాలిక పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. చిత్రంలో ఛైర్మన్‌ రాజు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: పేదలకు చౌక ధరకు భోజనం పెట్టేందుకు చౌటుప్పల్‌ పట్టణంలో రూ.30 లక్షలతో అన్నపూర్ణ క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలని పురపాలిక పాలకవర్గ సమావేశంలో తీర్మానించారు. ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన చౌటుప్పల్‌ పురపాలికను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మంత్రి కేటీఆర్‌ రూ.50 కోట్లు మంజూరు చేశారని, రూ.25కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఇరవై అన్ని వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. నాగులకుంటను ఉద్యానవనంలా మార్చాలని ఆయన సూచించారు. పట్టణ కేంద్రంలోని చెరువు ఒడ్డున ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధికి రూ.50లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఔట్‌ సోర్సింగ్‌లో నియమితులైన కంప్యూటర్‌ ఆపరేటర్లు బిల్లుల విడుదల కోసం గుత్తేదారులను ఒక శాతం కమీషన్‌ డిమాండ్‌ చేస్తున్నారని కౌన్సిలర్‌ కొయ్యడ సైదులు సమావేశంలో ఫిర్యాదు చేశారు. పురపాలికకు చెందిన కూరగాయల మార్కెట్‌ అద్దె నాలుగేళ్లుగా ఎందుకు వసూలు చేయడం లేదని కౌన్సిలర్‌ పోలోజు శ్రీధర్‌బాబు సమావేశంలో అడిగారు. దోమల నివారణకు అన్ని కాలనీల్లో ఫాగింగ్‌ చేయించాలని కౌన్సిలర్లు కోరారు. ఉప ఛైర్మన్‌ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు కాసర్ల మంజుల, కొరగోని లింగస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు వినతిపత్రం..

చౌటుప్పల్‌ పురపాలిక పరిధిలోని అన్ని వార్డులను సందర్శించాలని, అన్ని వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి భాజపాకు చెందిన కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని