logo

అందరి ఇ(క)ళ్లల్లో.. జూన్‌ ఆందోళన

వేసవి సెలవులు ముగుస్తున్నాయి.. Ëవచ్చేది వానాకాలం. మరో వైపు విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అన్నీ జూన్‌ నెలలోనే మొదలు కావడంతో ఒకటో తారీఖు వచ్చిందంటే తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి నెలకొంటోంది.

Published : 01 Jun 2023 03:11 IST

దుక్కి దున్ని విత్తనాలు నాటుతున్న కూలీలు (పాత చిత్రం)

భానుపురి, న్యూస్‌టుడే: వేసవి సెలవులు ముగుస్తున్నాయి.. వచ్చేది వానాకాలం. మరో వైపు విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అన్నీ జూన్‌ నెలలోనే మొదలు కావడంతో ఒకటో తారీఖు వచ్చిందంటే తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితి నెలకొంటోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ నెల పెద్ద కుదుపులాంటిదే. ఏడాది మొత్తంలోనే ఎదురు కాని ఆర్థిక భారం జూన్‌ నెలలో మోయాల్సి వస్తుంది. ఇందుకు ఏ ఒక్కరూ అతీతులు కారు. వేసవి సెలవుల్లో విశ్రాంతి తీసుకున్న వారిని ఉలిక్కిపడేలా చేసే మాసమిది. రెక్కల కష్టం రెండురోజుల్లో ఆవిరవుతుందనే ఆందోళన. ఖర్చుల బండిని సాగదీసే పనిలో కుటుంబ పెద్దలు, ప్రవేశాలు, ఫలితాల హడావుడిలో విద్యార్థులు, సాగు మొదలుపెట్దేదెలా అని రైతులు, వంటింటిని నడిపించేదెలా అని గృహిణులు, ఇలా అందరిలోనూ అంతర్మథనం మొదలవుతోంది.

విద్యార్థులకు అసలు పరీక్ష

సెలవులు అప్పుడే అయిపోవాలా.. ఇంకొన్నాళ్లుంటే బాగుండు, ఇదీ విద్యార్థుల మనసుల్లో ఉండే ఆలోచన. సరదాగా గడిపిన రోజులకు స్వస్తిపలికి చదువులు, పరీక్షలు, కొత్త కోర్సులు ఒకటేంటి అన్ని కష్టాలను మోసుకొచ్చే జూన్‌ను చూసి విద్యార్థులైతే నిజంగానే జంకుతారు. కొత్తగా పాఠశాలల్లో, కళాశాలల్లో చేరేవారికి ఇదో పెద్ద ప్రయాసే. ఇక మనసులో ఫలితాల అలజడి ఎలాగూ ఉండనే ఉంటుంది.

సంపాదన ఖర్చులకే సరి

ఎన్నిసార్లు లెక్కలేసుకున్నా.. ఎన్ని మినహాయింపులిచ్చినా ఈ నెలలో రాశీవాసి కలవని వారున్నారంటే వారు కచ్చితంగా ఇంటి పెద్దలే. పిల్లల చదువు, పాఠశాలల్లో ఫీజులు, పుస్తకాలు, దుస్తులు ఇలా ఎన్నో రకాల వ్యయం, జీతం ఎంతైనా అంతకు రెట్టింపు ఖర్చులు ఖాయం. ఎల్‌కేజీ నుంచి ప్రతి విద్యార్థికి మొదట రూ.6వేలు, పుస్తకాలు, తినుబండారాలకు రూ.2500 ఖర్చు వస్తుంది. కళాశాల ఫీజులు మోయలేని భారమే. ఎవరినైనా అప్పు అడుగుదామంటే దాదాపు అందరి ఇళ్లల్లో ఇదే పరిస్థితి.

అన్నదాతల కష్టాలకు బీజం

రైతుల ఆరుగాలం కష్టానికి ఇప్పుడే బీజం పడుతుంది. కాలం కలిసి రాకుంటే ఆ కష్టం రెట్టింపవుతుంది. సాగు కోసం శ్రీకారం చుట్టే మాసమిది. అందరి కంటే ఆర్థిక ఇబ్బందులు అన్నదాతకే ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడులు మొదలు, విత్తన ఎంపిక, ఎరువుల సౌలభ్యం ఇలా ఎన్నో ఆందోళనలు.. అన్నింటికీ ఈ నెలే కారణం. గతేడాది పంటలు నష్టపోయిన డబ్బులు ఇంకా చేతికి రాలేదు. పెరిగిన ధరలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి. నకిలీ విత్తనాల భయం పొంచి ఉండనే ఉంది. రైతు దుక్కిదున్ని విత్తనాలు నాటే వరకు ఎకరానికి పత్తి, వేరుసెనగకు రూ.16వేలు వెచ్చించాల్సి వస్తుంది.

ఇల్లాలి ఇబ్బందులు అన్నీఇన్నీ కావు

అందరూ ఎలా ఉన్నా ఇంట్లో ఆర్థిక స్థిరత్వానికి ఇల్లాలి పాత్ర కీలకం. ఒడిదొడుకులు లేకుండా బడ్జెట్‌ను సరిచేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. వారి చిక్కులు వంటింటి నుంచి మొదలవుతాయి. ఇప్పటికే పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఖర్చుల ప్రభావం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా వీరిపైనే ఉంటుంది. పిల్లలను పాఠశాలకు సన్నద్ధం చేయడం, వివిధ పనుల నిమిత్తం వెళ్లే భర్తకు ఆసరాగా ఉండటం లాంటి అదనపు భారాలు మొదలు కానున్నాయి.

తినుబండారాలు తయారు చేస్తున్న మహిళలు(పాతచిత్రం)

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని