logo

గెట్టు తగాదాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ

గెట్టు విషయంలో నెలకొన్న సుమారు గుంట, గుంటన్నర భూమి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. క్షణికావేశంతో గొడ్డళ్లతో దాడులు చేసుకునే స్థితికి దారి తీసింది.

Published : 08 Jun 2023 03:24 IST

క్షణికావేశంతో గొడ్డళ్లతో పరస్పరం దాడులు
నలుగురికి తీవ్ర గాయాలు

ఘటనా స్థలంలో క్షతగాత్రులు

అడ్డగూడూరు, న్యూస్‌టుడే: గెట్టు విషయంలో నెలకొన్న సుమారు గుంట, గుంటన్నర భూమి వివాదం అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. క్షణికావేశంతో గొడ్డళ్లతో దాడులు చేసుకునే స్థితికి దారి తీసింది. భూ వివాదంలో అన్నదమ్ములు, వారి కుమారుల మధ్య ఘర్షణ తలెత్తగా గొడ్డళ్లతో పరస్పరం కొట్టుకొని తీవ్ర గాయాలపాలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం మానాయికుంటలో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మార్త బుచ్చయ్యకు ఇద్దరు కుమారులు వీరయ్య, సైదులు ఉన్నారు. తనకున్న రెండు ఎకరాల భూమిని ఇద్దరికి సమానంగా పంచారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా సరిహద్దు(గెట్టు) తగాదాలు జరుగుతున్నాయి. మూడు అడుగులు వెడల్పుతో పొడువునా ఉండే గెట్టు విషయంతో గొడవ జరుగుతోంది. మంగళవారం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా, బుధవారానికి వాయిదా వేశారు. ఇంతలో పెద్దకుమారుడు వీరయ్య, తన కుమారుడు ప్రభాస్‌ తమ చెల్కలో పత్తి విత్తనాలు విత్తడానికి కూలీ మనిషి గుర్రం కొమరయ్యతో అచ్చు తోలుతున్నారు. అదే సమయంలో ఆయన తమ్ముడు సైదులు, తన కుమారుడు శేఖర్‌ చెరో గొడ్డలి పట్టుకొని అక్కడికి చేరుకొన్నారు. పంచాయతీ తీర్మానం కాలేదు.. భూమి కొలవక ముందే ఎందుకు దున్నిస్తున్నారని గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు అన్నదమ్ములు, వారి కుమారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. క్షణికావేశంతో గొడ్డళ్లతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో తమ్ముడు మార్త సైదులు ఎడమచేయి తెగిపడగా, అతని కుమారుడు శేఖర్‌ వెన్నెముకకు గొడ్డలివేటు పడటంతో తీవ్రగాయాలయ్యాయి.

* అన్న మార్త వీరయ్య భుజంపై గొడ్డలివేటు పడగా, అతని కుమారుడు ప్రభాస్‌ తలకు తీవ్రం కాగా.. వేటుకు మూడు చోట్ల ఎడమచేతి విరిగింది. స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులు అన్నదమ్ములు, వారి కుమారులను ఒకే 108 వాహనంలో మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం భువనగిరి జనరల్‌ ఆస్పత్రికి అటు నుంచి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఊహించని పరిణామంతో మానాయికుంట గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలాన్ని రామన్నపేట సీఐ మోతీరాం, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ పరిశీలించారు. ఈ మేరకు ఇరువర్గాల వారిపైన హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వివరించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని