logo

ప్రచార అనుమతులకు సువిధ

ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Published : 28 Mar 2024 05:07 IST

సువిధ పోర్టల్‌ ముఖ చిత్రం

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీంట్లో భాగంగానే ఓటు నమోదు నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సైతం ప్రత్యేకయాప్‌లు, వెబ్‌సైట్లు, పోర్టళ్లు రూపొందించింది. గతంలో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ ప్రజల్లో అవగాహన లేకపోవడంతో వినియోగం తక్కువగా ఉంది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల నుంచే యాప్‌లు, పోర్టళ్లపై విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రత్యేకంగా సిబ్బందిని సైతం నియమిస్తుంది. త్వరలో జరగనున్న లోక్‌సభ  ఎన్నికల నేపథ్యంలో ప్రచార అనుమతులకు ‘సువిధ’ పోర్టల్‌ వినియోగానికి ఇటీవలే ప్రత్యేక సిబ్బందిని నియమించిన అధికారులు అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాట్లు చేశారు.

మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యానర్‌

అన్ని ప్రచార అనుమతులకు..

ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో వివిధ అనుమతుల కోసం ‘సువిధ’ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు suvidha.eci.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫోన్‌ నంబర్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకోవాలి. అనంతరం  48 గంటల్లోపు పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే.. నోడల్‌ అధికారులైన రెవెన్యూ, పోలీస్‌, ఆర్టీఏ అధికారులు తమ రిమార్కులు నమోదు చేస్తారు. వాటికనుగుణంగా అనుమతి ఇవ్వడం, తిరస్కరించడం చేస్తారు. అనుమతించిన వాటికి రాతపూర్వకంగా ధ్రువీకరణ పత్రం సైతం అందిస్తారు. ఆఫ్‌లైన్‌లోనూ సంబంధిత నియోజకవర్గ కేంద్రంలోని ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల ప్రచారానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు..

  • సమావేశాల నిర్వహణ
  • ర్యాలీలు, ప్రదర్శనలు
  • వాహనాల అనుమతులు
  • తాత్కాలిక ఎన్నికల కార్యాలయం ఏర్పాటు
  • లౌడ్‌ స్పీకర్ల ఏర్పాటు
  • హెలికాప్టర్లు, హెలిప్యాడ్ల వినియోగం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని