logo

దగా ఆలోచనలపై.. నిఘా

గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు.

Published : 28 Mar 2024 05:21 IST

అభ్యంతరకర పోస్టులు షేర్‌ చేస్తే చిక్కులే

గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. కించపర్చే విధంగా ఉన్న  సదరు వీడియోపై ఫిర్యాదులు రావడంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌తో పాటు, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్న ఆ యువకుడు కేసుల్లో చిక్కుకోవడంతో ఉన్నత ఆశయం చేరుకోవడానికి ప్రతిబంధకంగా మారింది.


గత శాసనసభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాలపై వచ్చిన ఫిర్యాదులు, పోలీసుల నిఘా ద్వారా గుర్తించిన వాటిపై దాదాపుగా జిల్లాలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఎన్నికల వేళ ఒక్కసారి కేసులు నమోదు అయితే వాటిని పరిష్కరించుకోవడానికి వీలులేకుండా ఉంటాయి. తప్పనిసరిగా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సిందే.  


భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా పోస్టులు, వీడియోలు, రీల్స్‌ వస్తుంటాయి. ఎన్నికల సమయంలో ప్రతి అంశం, తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉంటుంది. తమ అభిమాన పార్టీలు, నాయకులుకు ప్రచారం కల్పించాలనే కుతుహలంతో ప్రత్యుర్థులుగా ఉండేవారిపై రకరకాలుగా  పోస్టులు, వీడియోలను వాట్సప్‌, ఫేస్‌బుక్‌ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా షేర్‌ చేస్తుంటారు. అభ్యర్థులు, పార్టీలకు సంబంధించిన అభ్యంతరకరమైన అంశాలతో పాటు, కించపర్చే వ్యాఖ్యలు ఉంటాయి. వాటిని చూస్తూ ఇతరులకు షేర్‌ చేయాలనే ఉత్సాహంతో మరిన్ని గ్రూపులలో పోస్టు చేస్తుంటారు. తెలియక చేసిన పోస్టులే కేసుల్లో చిక్కుకునేలా చేస్తాయి. ఎన్నికల సమయంలో కేసుల్లో అభ్యంతకరమైన పోస్టులపై అందిన ఫిర్యాదులతో పోలీసులు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కింద నమోదు చేస్తున్నారు. యువతపై ఎన్నికల వేళ నమోదైన కేసులు వెంటాడుతుంటాయి. కేసుల్లో ఇరుక్కోవడంతో చదువు, ఉద్యోగంపై ప్రభావం పడుతుంది.

గ్రూప్‌ అడ్మిన్‌ తస్మాత్‌ జాగ్రత్త

వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లోని గ్రూపుల్లో ఉండే సభ్యులు ఇష్టానుసారంగా పోస్టులు, వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అభ్యంతరకర పోస్టులకు గ్రూపు అడ్మిన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిలో వచ్చే రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు, అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా చేసినట్లయితే వాటికీ బాధ్యత వహించాల్సిదేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


నిరాధారమైన పోస్టులు చేస్తే చర్యలు తప్పవు
ఎం.రాజేశ్‌చంద్ర, డీసీపీ

ఎన్నికల నియమావళి అమలులో భాగంగా సోషల్‌మీడియోపై ప్రత్యేక నిఘా ఉంచాం. వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా వీడియోలు, వ్యాఖ్యానాలు చేసినట్లయితే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌తో పాటు, ప్రజాప్రతినిధ్య, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తాం. ఎన్నికల వేళ వాట్సప్‌ గ్రూపుల్లో చేసే చర్చలు హద్దుదాటితే చర్యలు తప్పవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని