logo

మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష

మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్‌ అలియాస్‌ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది.

Published : 29 Mar 2024 02:24 IST

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్‌ అలియాస్‌ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు చెప్పింది. దోషికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.మారుతిదేవి గురువారం తీర్పు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో నివాసం ఉండే వివాహిత మహిళ(37)కు జనగాం జిల్లా దేవరుప్పల మండలం ధర్మగడ్డతండాకు చెందిన అరె కుమార్‌(27)తో పరిచయం ఏర్పడింది. మహిళ భర్త చనిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తుండేది. మహిళతో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకొని కుమార్‌ ఆమెను శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడు. 2020 నవంబర్‌ 11న మహిళకు నిందితుడు కుమార్‌ మాయమాటలు చెప్పి భువనగిరి బైపాస్‌ రోడ్డులో నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి గొంతు కోసి, తలపై రాయితో మోది హత్యకు పాల్పడి అక్కడ నుంచి పారిపోయాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి హత్య చేసింది కుమార్‌గా గుర్తించి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసుకు సంబంధించిన అప్పటి ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ వైద్య నివేదికలు, ఫోరెన్సిక్‌ రిపోర్టులు, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారాలను, సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పీపీ దామోదర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. కోర్టుకు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, సత్యనారాయణ హాజరయ్యారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.  హత్యకు గురైన మహిళకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉండగా ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని