logo

భూసారం తగ్గిపోతోంది

పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది.

Published : 29 Mar 2024 02:33 IST

ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక భూసార పరీక్ష కేంద్రం

మిర్యాలగూడ, హాలియా, న్యూస్‌టుడే: పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. పీహెచ్‌ (గాఢత) ఏటా పెరిగిపోతున్న తీరుతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయే ప్రమాదం ఉంది. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ రైతులకు ఈ స్థాయిలో అవగాహన కల్పించట్లేదు. దీంతో వారు సైతం రెడీమెడ్‌ వ్యవసాయానికి అలవాటు పడటంతో భవిష్యత్తులో భూములు పంటలకు అనువుగా ఉండే పరిస్థితి లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు దిగుబడి అధికంగా రావాలంటూ ఎరువులు, పురుగు మందులు గతం కంటే రెట్టింపుగా వినియోగిస్తుండగా ధీర్ఘకాలంలో భూముల సారంపై ప్రభావం పడుతున్నాయి.

  • 2020 వరకు భూసార పరీక్షలు చేయించే బాధ్యత వ్యవసాయశాఖ సిబ్బందికి ఉండగా.. నాలుగేళ్లుగా ఈ తరహా లక్ష్యాలు నిర్ణయించలేదు. రైతులే తమ ఆసక్తితో వచ్చి భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించగా.. ఆశించిన మేరకు రైతులు ముందుకు రావటంలేదు. ఉమ్మడి జిల్లాలోనే ఒకటిగా ఉన్న మిర్యాలగూడ భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షలు ఏటా తగ్గిపోతున్న తీరు రైతుల అనాసక్తికి అద్దం పడుతుంది.
  • రైతు వేదికలు నిర్మించిన సమయంలో భూసార పరీక్షల కిట్‌లు అందుబాటులో ఉంచి రైతులకు అవసరమైనప్పుడు పరీక్షలు చేయించాలని నిర్ణయించారు.అయితే కిట్‌లు ఇచ్చి రసాయనాలు అందించలేదు. కొన్నిచోట్ల రసాయనాలు అయిపోగా ఇప్పటి వరకు సరఫరా చేయలేదు.
  • ఉమ్మడి జిల్లాలో రైతులు పూర్తిగా వరి సాగు పైనే దృష్టిసారించడంతో ఇతర పంటల సాగు తగ్గిపోతుంది. బత్తాయి తోటలను సైతం తొలగించి రైతులు వరి సాగుచేస్తున్నారు. వరికి సైతం ఎకరానికి ఒక బస్తా యూరియా సరిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నా.. ప్రైవేటు కంపెనీల మాటలు విని రైతులు మూడు బస్తాల వరకు యూరియా వినియోగిస్తుండగా ఇది భూసారంపై ప్రభావం పడుతుంది.
  • యూరియా లీటర్‌ బాటిళ్లలో తయారు చేయిస్తూ ప్రభుత్వం గత రెండేళ్లుగా విక్రయాలు చేపడుతున్నా.. వీటిని వినియోగించేందుకు రైతులు ఆసక్తి చూపటం లేదు.

భూసార పరీక్షలు చేయించుకోవాలి..

నాగమణి, ఏడీఏ మిర్యాలగూడ

రైతలు భూసార పరీక్షలు చేయించుకుని వ్యవసాయ సిబ్బంది సూచనల మేరకు ఎరువులు వినియోగించాలి. గ్రామాల్లో రైతులను భూసార పరీక్షలు చేయించుకోవాలంటూ కింది స్థాయిలో ఏఈవోలు, ఇతర సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని